అగ్ర కథానాయికలు సాధారణంగా పదికోట్ల లోపే పారితోషికాన్ని అందుకుంటారు. పాన్ ఇండియా ట్రెండ్ వల్ల ఇటీవలి కాలంలో వారి రెమ్యునరేషన్స్‌లో భారీ పెరుగుదల కనిపిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం ‘స్పిరిట్’ సినిమా కోసం బాలీవుడ్ అగ్ర నాయిక దీపికా పడుకోన్‌కు 20కోట్ల పారితోషికాన్ని ఆఫర్ చేశారని ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఇప్పటివరకు అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయికగా దీపికా రికార్డుల్లోకెక్కడం ఖాయమంటున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ తెరకెక్కనుంది.
వచ్చే నెలలో సెట్స్మీదికి వెళ్లనుందని సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా మృణాల్ ఠాకూర్, అలియాభట్, రష్మిక మందన్నతో పాటు పలువురు అగ్ర నాయికల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఎవరినీ ఖరారు చేయలేదు. తాజాగా దీపికా పడుకోన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఈ సినిమా కోసం 20కోట్ల భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందని, మేకర్స్ కూడా అంతమొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో ప్రభాస్-దీపికా కలిసి నటించారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అపూర్వ విజయం సాధించింది.