Spirit | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ ప్రారంభం నుంచే అంచనాలను సొంతం చేసుకుంది. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి రా-ఇంటెన్సిటీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరచుకున్న వంగా, ఈసారి ప్రభాస్‌ను పూర్తిగా భిన్నమైన యాక్షన్ డ్రామాలో చూపించబోతున్నాడు. ముఖ్యంగా ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారన్న విషయం అభిమానుల్లో అంచనాలు పెంచింది. తాజా సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’ కోసం చిత్రబృందం అత్యంత భారీ పోలీస్ స్టేషన్ సెట్‌ను ప్రత్యేకంగా నిర్మిస్తోంది.
ఇది కేవలం సెట్గానే కాకుండా, కథలో కీలక పాత్ర పోషించేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరో ఎంట్రీలు ఎంత వైల్డ్‌గా ఉంటాయో తెలిసిందే. అదే స్థాయిలోనే ఈ సినిమాలో కూడా ప్రభాస్‌కు ఓ మైండ్–బ్లోయింగ్ పవర్ఫుల్ ఎంట్రీ ప్లాన్ చేసినట్టు టాక్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే…పోలీస్ స్టేషన్ సెట్లో ప్రభాస్ కోసం అదిరిపోయే ఎంట్రీ సాంగ్ చిత్రీకరించేందుకు సిద్ధమవుతున్నారు. కేవలం పాట మాత్రమే కాదు, అదే లొకేషన్లో భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్లు కూడా ఉంటాయి. వంగా మార్క్ మేనరిజం, ఇంటెన్స్ సీన్స్, రా ఎనర్జీతో రూపొందే వీటి వల్ల థియేటర్లు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌తో కేకలు పెట్టడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు.
ఇన్సైడ్ టాక్ ప్రకారం, ప్రభాస్ ఇప్పటివరకు ఎప్పుడూ చేయని రీతిలో ఒక వైల్డ్, అగ్రెసివ్, రా పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఈ పాత్ర పూర్తిగా ఇంటెన్సిటీతో నిండిపోయి, వంగా ప్రత్యేక టచ్‌తో మరో లెవెల్లో రూపొందుతోంది. అటు సెట్ డిజైన్ నుంచి, లైటింగ్ వరకు అన్నీ డార్క్, రియలిస్టిక్ టోన్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ‘స్పిరిట్’ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ‘స్పిరిట్’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నప్పటికీ, ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్తోంది. ప్రభాస్–వంగా కాంబో నుంచి ప్రేక్షకులు భారీ స్థాయి ఎమోషన్, వైలెన్స్, మాస్ ఎలిమెంట్స్‌ను ఆశిస్తున్నారు. ముఖ్యంగా కొత్త పోలీస్ అవతారంలో ప్రభాస్ ఎలా అలరిస్తాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.