అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలతో ‘స్పైడర్‌మెన్’ సిరీస్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్ని అలరించాయి. ఈ సిరీస్ పరంపరలో వస్తోన్న తాజా చిత్రం ‘స్పైడర్‌మెన్ నో వే హోమ్’. టామ్ హోలాండ్, జెండాయా, బెనెడిక్ట్ కంబర్బ్యాచ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జాన్ వాట్స్ దర్శకుడు. ఇండియాలో ఈ నెల 16న ఈ చిత్రం విడుదలకానుండగా ఇతర దేశాల్లో 17న ప్రేక్షకుల ముందుకురానున్నది. ‘సూపర్‌హీరో కథాంశంతో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. కాలగమనంలో వెనక్కివెళ్లిన స్పైడర్‌మెన్ కొత్త శత్రువులతో ఎలాంటి పోరాటం చేశాడన్నది ఆకట్టుకుంటుంది. పోరాట ఘట్టాలు సరికొత్త అనుభూతిని పంచుతాయి. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలచేస్తున్నాం’ అని సోనీ పిక్చర్స్ సంస్థ తెలిపింది.