బస్సు సౌకర్యం కూడా లేని ఊళ్లో పుట్టాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. ఊరి పొలిమేర దాటి.. దేశ సరిహద్దులకు చేరాడు. బీఎస్ఎఫ్ జవాన్‌గా గస్తీ కాస్తున్నాడు. చిన్నప్పటి నుంచి పాట మీద ప్రేమ పెంచుకున్న అతను.. ఇప్పుడు ఆహాలో ప్రసారం అవుతున్న ఇండియన్ ఐడల్ తెలుగులో గొంతు విప్పి శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తున్నాడు. అతడి పేరు నగిరి చక్రపాణి. ఈ సైనికుడు తన పాటల ప్రస్థానం గురించి జిందగీతో ఇలా పంచుకున్నాడు..
మాది పలాస దగ్గర పొత్తంగి. చిన్న
పల్లెటూరు. చిన్నప్పటి నుంచి పాటలంటే ఇష్టం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు టేప్ రికార్డర్లో వింటూ, లిరిక్స్ రాసుకొని బట్టీ పట్టేవాణ్ని. ఒంటరిగా పాడుకునేవాణ్ని. నాలో ఒక గాయకుడు ఉన్నాడని నా స్నేహితుడు ప్రవీణ్ గుర్తించాడు. వాడికోసమే మొదటిసారి పాడాను. అది విని మా మామయ్య కృష్ణారావు శిక్షణ తీసుకోమంటూ సలహా ఇచ్చాడు. నా జీవితం గురించి చెప్పాలంటే.. చిన్నప్పుడే నాన్న పోయారు. నన్ను, అన్నయ్యను, అక్కను అమ్మ పోషించింది. ఇల్లు గడవడమే కష్టం అనుకుంటే.. ఇక కోచింగ్ ఏం తీసుకుంటాం! పాటలు వింటూ.. పాడుకునేవాణ్ని. మా ముగ్గురిని హాస్టల్లో జాయిన్ చేసి ఉపాధి కోసం ఢిల్లీ వెళ్లింది అమ్మ. వేసవి సెలవుల్లో ఒక టీచర్ దగ్గర కొన్ని రోజులు పాటలు నేర్చుకున్నా. వేసవిలో హాస్టల్స్ మూసేస్తే మా ఇంటికి వెళ్లేవాళ్లం. అమ్మ ఢిల్లీలో ఉండేది. మా పక్కింటి ముత్యాలమ్మ అత్త మమ్మల్ని సొంతబిడ్డల్లా చూసుకున్నారు. ఈ పరిస్థితుల నడుమ.. ఇంటర్ పూర్తిచేసి తర్వాత బీఎస్ఎఫ్ నియామక పరీక్ష రాసి అర్హత సాధించాను.
Chakrapani1
చిన్నప్పటి నుంచి టీవీలో కనిపించాలని ఉండేది. ఇప్పుడు ప్రతిరోజూ టీవీలో కనిపిస్తున్నా. స్టేజీ మీద నన్ను చూసి మా అమ్మ బోరున ఏడ్చేసింది. గీతా మాధురి మేడమ్ మా అమ్మను జడ్జి కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించారు. అందులో కూర్చొని అమ్మ నా పెర్ఫార్మెన్స్ చూసింది. నా జీవితానికి ఇది చాలు అనిపించింది.
ఆర్మీ ట్రైనింగ్ ఏడాదిపాటు కొనసాగింది. చిన్నప్పుడు నేను పడిన కష్టాలతో పోలిస్తే ఆ శిక్షణ పెద్ద కష్టంగా అనిపించలేదు. కానీ ఒంటరితనం అనిపించేది. మా అమ్మ, ఊళ్లోని స్నేహితులు గుర్తొచ్చినప్పుడు.. పాటలు పాడుకుంటూ నన్ను నేను ఓదార్చుకునేవాణ్ని. సైన్యంలో నా పాట అందరికీ నచ్చేది. పై అధికారులు కూడా ప్రోత్సహించేవాళ్లు. ఛత్తీస్‌గఢ్‌లో మూడేండ్లు పనిచేశాను. మా క్యాంప్‌లో ఏ కార్యక్రమం జరిగినా ‘చక్రపాణీ అచ్ఛా గానా గావోనా’ అనేవారు. అప్పుడే, ఇండియన్ ఐడల్ గురించి తెలిసింది. ఆన్లైన్లో ఐప్లె చేశాను. ఎంతోమంది దరఖాస్తు చేస్తారు, నాకు అవకాశం వస్తుందా.. అనే అనుమానం ఉండేది. అయినా, గుండెల నిండా ఆశతో.. ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని నేరుగా హైదరాబాద్ వచ్చి ఆడిషన్స్‌లో పాల్గొన్నా. సెలెక్ట్ అయ్యాను. విషయం తెలిసి మా సార్ వాళ్లు కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు.
‘సెలవుల గురించి ఆలోచించకు.. హ్యాపీగా పోటీల్లో పాల్గొను’ అని ఎంకరేజ్ చేశారు. ఇప్పటి వరకు 8 రౌండ్స్ పూర్తయ్యాయి. తమన్, గీతా మాధురి, అనంత శ్రీరామ్, ఇంకా మిగతా జడ్జిలందరూ మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఒక ఎపిసోడ్లో అయితే నా పాట విని.. బాలకృష్ణ గారు ‘సైనికా.. అందుకో నా సెల్యూట్’ అంటూ అభివాదం చేశారు. చరణ్ సర్కి నా పాట నచ్చి.. ఎస్పీబీ గారు పాట పాడిన మైకును నాకు బహుమతిగా ఇచ్చారు. ఇండియన్ ఐడల్ తెలుగు టైటిల్ గెలిచినంత సంతోషంగా అనిపించింది. ఎక్కడో పొత్తంగిలో ఉండే నేను.. ఏ సంగీత జ్ఞానం లేని ఇలాంటి వేదిక నుంచి లక్షల మంది హృదయాలను గెలుచుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా! ఈ స్వరం దేవుడిచ్చిన వరం. ఎంతమందికి చేరితే అంత సంతోషం. అవకాశం వస్తే.. సినిమా గాయకుడిగానూ నిరూపించుకుంటా.
…?సుంకరి