Romance with stars at grandfather’s age | ఈ మధ్య సౌత్‌లో ఉన్న అగ్ర కథానాయకులు తమ వయసుకు మించిన హీరోయిన్లతో రొమాంటిక్ సీన్లలో నటించడంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఎంజీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి తారలు ఇలాంటి పాత్రలు చేసినా, అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడంతో ఈ విషయాలు పెద్దగా వెలుగులోకి రాలేదు. కానీ, నేటి డిజిటల్ యుగంలో ఏ చిన్న విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతోంది.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన చిత్రం ‘భోళా శంకర్’లో యాంకర్ శ్రీముఖి నడుము చూడటం, ‘వాల్తేరు వీరయ్య’లో శృతి హాసన్‌తో రొమాన్స్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. నందమూరి బాలకృష్ణ నటించన డాకు మాహారాజ్లో ఊర్వశి రౌతేలా వెనుక భాగాన్ని కొట్టడం జాతీయ స్థాయిలో వైరల్ అయింది. దీనిపై కొందరు ఆయనకు పద్మభూషణ్ ఇవ్వడంపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. మాస్ మహారాజ్ రవితేజ కూడా ప్రతి సినిమాలో యంగ్ హీరోయిన్ను తీసుకోవడం, వారిద్దరి మధ్య దాదాపు 25 ఏళ్లకు పైగా వయసు వ్యత్యాసం ఉండటం కూడా విమర్శలకు దారితీస్తోంది. ఆయన నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’లోని ఒక పాటలో హీరోయిన్ జేబులో చేయి పెట్టడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాజాగా ఈ జాబితాలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ చేరారు. మణిరత్నం దర్శకత్వంలో ఆయన నటిస్తున్న థగ్ లైఫ్’ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. శనివారం విడుదలైన ట్రైలర్లో కమల్ తన కంటే 30 ఏళ్లు చిన్నదైన నటి త్రిషతో పాటు నటి అభిరామితో రొమాన్స్ చేయడం చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘తాత వయసులో ఈ రొమాన్స్ ఏంటి?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
దీంతో తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులు రెండు వర్గాలుగా విడిపోయి తమ హీరోలను సమర్థించుకుంటూ, ఇతర హీరోలను ట్రోల్ చేసుకుంటున్నారు. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మరోవైపు, హాలీవుడ్లో ఇలాంటి ట్రెండ్ ఎప్పటినుంచో ఉందని, కానీ భారతీయ సంస్కృతి దీనిని అంతగా అంగీకరించలేకపోతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.