Movies on Constitution | భారత రాజ్యాంగం.. మన జాతీయ శాసనం. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే రక్షాకవచం. ప్రభుత్వాల అధికారాలు, విధులను నిర్దేశించే అత్యున్నత చట్టం. ఇక, సినిమా.. దేశవ్యాప్తంగా విస్తరించిన ఓ శక్తిమంతమైన మాధ్యమం. వెండితెరను వారధిగా చేసుకొని.. రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పలువురు దర్శకనిర్మాతలు సంకల్పించారు. రాజ్యాంగ విభాగాలు, కథనాల ఆధారంగా కొన్ని సినిమాలు రూపొందించారు. వీటి ద్వారా ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచడంతోపాటు రాజ్యాంగ హక్కులపై పౌరులకు అవగాహన కల్పించారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16ను ప్రేరణగా తీసుకొని.. 2011లో ‘ఆరక్షణ్’ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు ప్రకాష్ ఝా. సామాజికంగా, మతపరంగా వెనుకబడిన ప్రజల కోసం రాజ్యాంగం కల్పించిన ‘రిజర్వేషన్ వ్యవస్థ’ గురించి చెబుతుందీ చిత్రం. వ్యాపారంగా మారిన విద్యావ్యవస్థ, తల్లిదండ్రుల ఆశయాలను దోపిడీ చేస్తున్న కోచింగ్ సెంటర్ల గురించీ చర్చిస్తుంది. అమితాబ్ బచ్చన్, సైఫ్ అలీఖాన్, దీపికా పదుకొణె, తన్వీ అజ్మీ, మనోజ్ బాజ్‌పేయి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం.. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని చెబుతుంది.
సుభాష్ కపూర్ దర్శకత్వంలో.. కోర్ట్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘జాలీ ఎల్ఎల్బీ’ చిత్రం. 2013లో వచ్చిన ఈ సినిమా.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ప్రస్తావిస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని చెబుతుంది. ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు.. వారి స్వేచ్ఛను కాపాడుకునే హక్కు ఉందన్న విషయాన్ని చాటుతుంది. ఇందులో అర్షద్ వార్సీ, అమృతా రావు, బోమన్ ఇరానీ ప్రధాన తారాగణం.
భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని డైరెక్టర్ ప్రకాష్ ఝా తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా.. సత్యాగ్రహ. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ని హైలైట్ చేస్తుంది. దేశంలో ప్రతి ఒక్కరికీ ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, స్వేచ్ఛ ఉందని చెబుతుంది. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి, ఉమ్మడిగా నిరసన తెలిపే హక్కు ఉందని చాటుతుంది. 2013లో వచ్చిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్‌గణ్, కరీనా కపూర్, అర్జున్ రాంపాల్, మనోజ్ బాజ్‌పేయి లాంటి అగ్రనటులు కీలక పాత్రలు పోషించారు.
2018లో వచ్చిన మరో లీగల్ కోర్ట్ డ్రామా.. ముల్క్! నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొంది.. ఈ చిత్రాన్ని రూపొందించారు డైరెక్టర్ అనుభవ్ సిన్హా . సినిమా కథ ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి, లక్నో నేపథ్యంలో.. ముస్లిం కుటుంబం చుట్టూ తిరుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) ప్రాముఖ్యాన్ని నొక్కి చెబుతుంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న ఏ వ్యక్తిని అయినా.. ఎలాంటి ఆధారాలు లేకుండా దోషిగా చూడకూడదని ఈ ఆర్టికల్ సూచిస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే.. నేరం రుజువయ్యే దాకా ఆ వ్యక్తి నిర్దోషే! అని చెబుతుంది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను, రిషి కపూర్ నటించారు.
ఐపీసీలోని సెక్షన్ 375ను ప్రేరణగా తీసుకొని, లీగల్ థ్రిల్లర్ కోర్ట్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అజయ్ బహ్ల్. అన్యాయానికి, అత్యాచారానికి గురైన మహిళల హక్కులను పరిరక్షించాలని ఈ చిత్రంలో చెప్పాడు. 2019లో విడుదలైన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, రిచా చద్దా కీలక పాత్రల్లో నటించారు.