సొసైటీ ఆఫ్ స్నో (స్పానిష్)
నెట్ఫ్లిక్స్: డిసెంబర్ 31
నటీనటులు: ఏంజో ఓగ్రిన్సిక్, మాటియాస్ రికాట్, అగస్టీన్ పర్డెల్లా తదితరులు
దర్శకత్వం: జె.ఎ.బయోనా
కొన్నిసార్లు వాస్తవ గాథలు కల్పిత కథల కన్నా గొప్పగా ఉంటాయి. భయానకంగా సాగుతాయి. దానికి కాస్త నాటకీయత జోడించి సినిమాగా మలిస్తే అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. అలాంటి సినిమానే ‘సొసైటీ ఆఫ్ స్నో’. 1972లో ఉరుగ్వే రగ్బీ జట్టు ఎదుర్కొన్న ఓ ఘోర ప్రమాదం ఆధారంగా ఇది తెరకెక్కింది. ప్రస్తుతం ఓటీటీలో ప్రభంజనం సృష్టిస్తున్నది. కథలోకి వెళ్తే.. ఓ రగ్బీ టీమ్ టోర్నమెంట్ కోసం ఉరుగ్వే రగ్బీ జట్టు చిలీలోని శాంటియాగోకు విమానంలో బయల్దేరుతుంది.
ఆటగాళ్లు, వారి కుటుంబసభ్యులు, ఐదుగురు విమాన సిబ్బంది మొత్తంగా 45 మంది ప్రయాణంలో ఉంటారు. విమానం ఆండీస్ పర్వతాలపై ప్రయాణిస్తుండగా మంచు తుఫాను కారణంగా అది కూలిపోతుంది. ఆ ప్రమాదంలో కొందరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతారు. మరికొందరు గాయాలతో బయటపడతారు. చుట్టూ మంచు పర్వతాలు, మైనస్ 20 డిగ్రీల చలి వెన్నులో వణుకుపుట్టిస్తుంది. తినడానికి ఆహారం దొరకని పరిస్థితి. గాయాలతో బయటపడిన వాళ్లు కూడా చలిని తట్టుకోలేక పూటకొకరు మరణిస్తుంటారు.
మిగిలిన కొందరు తమను ఎవరైనా కాపాడలేకపోతారా అని క్షణాలు యుగాల్లా గడిపేస్తుంటారు. ‘పది రోజులు అన్వేషించినా ఉరుగ్వే విమాన జాడలు తెలియరాలేదని, సెర్చ్ ఆపరేషన్ నిలిపివేస్తున్నామ’న్న ప్రకటన రేడియోలో వినడంతో ప్రయాణికుల ఆశలు పూర్తిగా ఆవిరవుతాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్రాణాలతో బయటపడలేమని అందరూ భావిస్తారు. అయినా, పట్టుదలతో రోజులు గడుపుతుంటారు.
ఏదైనా లోయ ప్రాంతానికి చేరుకుంటే సాయం దొరకొచ్చని భావించి బృందంలోని ఓ ఇద్దరు కొండల్లో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్లు గమ్యం చేరుకున్నారా? తాము బతికే ఉన్నామని ప్రపంచానికి తెలియజేశారా? మంచు గుప్పిట చిక్కుకున్న వాళ్లలో ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారు? అన్నది మిగిలిన కథ. హృద్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో.. కొన్ని సన్నివేశాలు గుండెను పిండేస్తాయి. ప్రాణాలు నిలుపుకోవడానికి వాళ్లు చేసిన ప్రయత్నాలు ఉత్కంఠ రేపుతాయి. తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. చూడదగ్గ సినిమా!