Sobhita Dhulipala | సినీ తారలు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల గత నెలలో నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో హైదరాబాద్లోని నాగార్జున నివాసంలో నిరాడంబరంగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నిశ్చితార్థ వేడుక గురించి శోభితా ధూళిపాళ్ల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా ఆ వేడుకను ఘనంగా నిర్వహించామని తెలిపింది. ఆమె మాట్లాడుతూ..
‘ప్రతి ఒక్కరికి నిశ్చితార్థ వేడుకు చాలా ప్రత్యేకమైనది. జీవితంలోని విలువైన క్షణాలవి. మన తెలుగు సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుక చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నా కుటుంబం తెలుగు సంస్కృతికి ఎంతో విలువనిస్తుంది. వారి కోరిక మేరకు నా శ్రేయోభిలాషుల సమక్షంలో ఎంతో సంప్రదాయబద్ధంగా వేడుక జరగడం సంతోషాన్నిచ్చింది. ఇక ఎంగేజ్మెంట్ గురించి ముందస్తుగా ఎలాంటి ప్రణాళికలు వేసుకోలేదు. జీవితంలోని మధుర క్షణాలను ఆస్వాదించాలనే ఆలోచనలతో నా మనసు నిండిపోయింది. కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించినా నా దృష్టిలో ఆ వేడుక ఘనంగా జరిగిందనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న చై-శోభితా ధూళిపాళ్ల త్వరలో పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు.