Sobhita Dhulipala | బాలీవుడ్లో కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు చేరువైన అందాల భామ శోభిత దూళిపాళ్ల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా పంచుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగు అమ్మాయి.. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యతో వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. అయితే తన జీవితంలో ఓ హీరో భర్తగా వస్తాడని తాను ఎన్నడూ ఊహించలేదని శోభిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. గుంటూరు జిల్లా తెనాలితో కుటుంబ మూలాలున్న శోభిత.. విశాఖపట్నంలో జన్మించి పెరిగింది. చదువు పూర్తైన తర్వాత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన ఆమె, 2013లో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా ఎర్త్’ పోటీలో విజేతగా నిలిచి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తితో బాలీవుడ్లో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది. తన అందం, నటనతో క్రమంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
తెలుగులో అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన శోభిత.. ఆ తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో విభిన్న పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇదే సమయంలో అక్కినేని నాగచైతన్యతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, వారి బంధం వివాహానికి దారితీసింది. 2024 డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లైన వెంటనే సినిమా షూటింగ్ కోసం తమిళనాడుకు వెళ్లాల్సి వచ్చిందని, కొన్ని రోజుల పాటు నెలకోసారి మాత్రమే నాగచైతన్యను కలిసే పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఇద్దరూ సినీ రంగంలో ఉండటంతో వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను బ్యాలెన్స్ చేసుకోవడం మొదట్లో కాస్త సవాలుగా అనిపించిందని చెప్పింది.
అయితే కాలక్రమేణా కొత్త జీవితానికి అలవాటు పడ్డామని, తమ వైవాహిక బంధం మరింత బలపడిందని శోభిత పేర్కొంది. “చిన్నప్పటి నుంచి నా పెళ్లి చాలా గ్రాండ్‌గా జరగాలని కలలు కనేదాన్ని. కానీ ఓ హీరోని పెళ్లి చేసుకుంటానని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. నా భర్త ఓ హీరో అవుతాడని కలలో కూడా అనుకోలేదు. కానీ అదృష్టవశాత్తు నా జీవితంలో అది నిజమైంది” అంటూ ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సినిమాల ఎంపికలో ప్రస్తుతం కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్న శోభిత.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు ఎప్పటికప్పుడు చేరువగానే ఉంటోంది. కెరీర్, వైవాహిక జీవితం మధ్య సమతుల్యతను సాధిస్తూ తన కొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తున్న శోభిత చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.