స్మితా పాటిల్.. అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో తన పవర్ఫుల్ నటనతో ఆకట్టుకున్న నటి. మిర్చ్ మసాలా, మంథన్, అర్ధ్ సత్య, అర్థ్, మండీ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, బీటౌన్‌లో స్టార్ హీరోయిన్ అయినా.. సెట్లో మాత్రం ఎంతో సాదాసీదాగా ఉండేదట. లైట్మెన్తో కలిసి కింద కూర్చొని భోజనం చేసేదట. ఈ విషయాన్ని స్మితా పాటిల్ కొడుకు, నటుడు ప్రతీక్ స్మితా పాటిల్ గుర్తు చేసుకున్నాడు. ఇటీవలే నాని హీరోగా వచ్చిన ‘హిట్-3’ చిత్రంలో ‘ఆల్ఫా’గా కనిపించిన ప్రతీక్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన తల్లి స్మితా పాటిల్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ‘ఎక్కడ షూటింగ్ జరిగినా.. అమ్మ ఎప్పుడూ ఇంటి నుంచే భోజనం తీసుకునేవారు.
సెట్లోనూ హీరోలతో కలిసి కాకుండా.. లైట్మెన్లతోనే ఆహారం పంచుకునేవారు. నేలపై కూర్చొనే తినేవారు” అంటూ గుర్తుచేసుకున్నాడు ప్రతీక్. అయితే, ఒకసారి అమితాబ్ బచ్చన్ సినిమా షూటింగ్ సమయంలోనూ అలాగే చేస్తే.. బిగ్‌బీ పిలిచి స్మితను మందలించారట. ‘మీరు లైట్మెన్లతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేయడం మంచిదే! కానీ, ఇలాంటి ప్రవర్తన మాకు చెడ్డపేరు తీసుకొస్తుంది. మీరు మాతోనే కలిసి భోజనం చేయాలి’ అని అన్నారట. అమితాబ్‌తో కలిసి శక్తి (1982), నమక్ హలాల్ (1982), పేట్ ప్యార్ ఔర్ పాప్ (1984) వంటి చిత్రాలలో కలిసి పనిచేసింది స్మిత.
జయప్రద ప్రధాన పాత్రలో నటించిన షరాబీ (1984)లో స్మిత అతిథి పాత్రలో మెరిసింది. పూణెలో పుట్టిపెరిగిన స్మిత.. ముంబయి దూరదర్శన్‌లో మరాఠీ వార్తలు చదివేది. ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్.. తన డిప్లొమా కోసం తీసిన చిత్రంలో స్మితా పాటిల్ నటించింది. తర్వాత శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో వచ్చిన చరణ్‌దాస్ చోర్ (1975) చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. 1970లలో బాలీవుడ్ టాప్‌హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందింది. హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే.. బాలీవుడ్ నటుడు రాజ్‌బబ్బర్‌ను వివాహం చేసుకున్నది. ప్రతీక్ పుట్టినప్పుడే.. అనారోగ్యంతో కన్నుమూసింది. ఇక ప్రతీక్ స్మితా పాటిల్ కూడా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి.. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.