సల్మాన్ ఖాన్-ఐశ్వర్య రాయ్ ప్రేమాయణం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ మిలీనియం ప్రారంభంలో.. బీటౌన్లో అత్యంత చర్చనీయాంశమైన ప్రేమకథ వీరిది. తాజాగా, వారి సహనటి స్మితా జయకర్.. ఒకప్పటి ఈ బాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్ లవ్ స్టోరీని మీడియాతో పంచుకున్నది. సల్మాన్-ఐశ్వర్య కలిసి నటించిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ షూటింగ్ సమయంలోనే వారి మధ్య ప్రేమ వికసించిందని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ జాతీయ మీడియాతో స్మిత మాట్లాడుతూ.. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ షూటింగ్ సంగతులు, సల్మాన్-ఐశ్వర్య ప్రేమ ముచ్చట్లనూ పంచుకున్నది.
సల్మాన్-ఐశ్వర్య ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుతూ.. “వారు అప్పుడే ప్రేమలో పడ్డారు. ఎప్పుడు ఎదురుపడినా.. ఇద్దరి కళ్లూ మెరిసిపోయేవి. వారి ముఖాల్లోనూ అంతులేని ప్రేమ కనిపించేది. అది ఆ సినిమాకూ ఎంతో ఉపయోగపడింది” అంటూ నాటి సంగతులను గుర్తు చేసుకున్నది. నిజానికి వారిద్దరూ ఒక్కటవుతారని అందరూ అనుకున్నారట. కానీ, వారి బంధం అల్లకల్లోలంగా మారిందనీ, ఇద్దరూ విడిపోవాల్సి వచ్చిందనీ ఆవేదన వ్యక్తంచేసింది. ఇక సల్మాన్ గురించి చెబుతూ.. అతను ఎంతో మంచివాడనీ, సెట్లో ఎప్పుడూ చలాకీగా ఉండేవాడనీ చెప్పుకొచ్చింది. సల్మాన్ కోపంగా ఉండటం తానెప్పుడూ చూడలేదని చెప్పింది.
ఐశ్వర్య అందాన్నీ తెగ పొగిడేస్తూ.. మేకప్ లేకపోయినా ఆమె చాలా అందంగా కనిపిస్తుందని కొనియాడింది. అందరితోనూ వినయంగా మెలిగేదని అంటున్నది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 1999లో వచ్చిన రొమాంటిక్ డ్రామా చిత్రం.. హమ్ దిల్ దే చుకే సనమ్. సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అజయ్ దేవ్గన్ నటించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. సల్మాన్-ఐశ్వర్య మధ్య కెమిస్ట్రీ, భన్సాలీ కవితాత్మక కథనం కలిసి.. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతోపాటు ఎన్నో అవార్డులనూ దక్కించుకున్నది.