Six Pack |ఇప్పుడు కోలీవుడ్‌లో సిక్స్ ప్యాక్ పంచాయతి చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజుల క్రితం చెన్నైలో జరిగిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య తండ్రి శివకుమార్ మాట్లాడుతూ కోలీవుడ్ లో మొదటి సిక్స్ ప్యాక్ తన బిడ్డే చేశాడని, గతంలో ఎవరు చేయలేదని కాస్త ఎమోషనల్‌గా మాట్లాడాడు. కొడుకు గొప్పదనం గురించి శివకుమార్ మాట్లాడుతూ.. నా కొడుకు కన్నా ముందు తమిళంలో సిక్స్ ప్యాక్ ఎవరు చేయలేదని, ఉంటే చెప్పాలని శివ కుమార్ యాంకర్స్‌ని కూడా ప్రశ్నించాడు. గంటలకు గంటలు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ, జిమ్‌లో వర్కౌట్లు చేయబట్టే సూర్య ఈ స్థాయికి వచ్చాడని అన్నాడు శివకుమార్
అయితే శివకుమార్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అలా మాట్లాడాడని కొన్ని విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో సూర్య కంటే ముందు ధనుష్, విశాల్ సిక్స్ ప్యాక్ బాడీని ట్రై చేశారని, సూర్య ముందు సిక్స్ ప్యాక్ చేశాడని ఆయన తండ్రి చెప్పడం ఏమి బాలేదంటూ కొందరు వాపోతున్నారు. గౌతమ్ మీనన్ చేసిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రంలో సూర్య పూర్తిగా సిక్స్ ప్యాక్‌లోనే ఉంటాడు. అయితే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ కంటే ముందు విశాల్ సత్యం సినిమా రిలీజ్ అయిందని, అందులో విశాల్ సిక్స్ ప్యాక్ లుక్‌లోనే కనిపిస్తాడని చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్ దీనిపై స్పందించాడు.
అందరి కంటే ముందుగా సిక్స్ ప్యాక్ ట్రై చేసింది ధనుష్ అని.. వెట్రిమారన్ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాడు అని విశాల్ అన్నాడు.. ఆ తరువాత సత్యం మూవీ కోసం తాను సిక్స్ ప్యాక్ చేశానని అన్నాడు. ఆ లుక్‌తోనే మదగజరాజా సినిమాలోనూ నటించాను. ఆ విషయాలను వాళ్లు మర్చిపోయి ఉండవచ్చు అని విశాల్ అన్నాడు. శివ కుమార్ వ్యాఖ్యలకు విశాల్ కౌంటర్ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ విషయమై కోలీవుడ్‌లో మరింత రచ్చ జరుగుతోంది. సూర్య అభిమానులు వర్సెస్ విశాల్, ధనుష్ అభిమానులు అన్నట్లుగా సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. కొందరు అయితే ధనుష్‌ది సిక్స్ ప్యాక్ అంటారా అంటూ విమర్శిస్తున్నారు. మరి ఆరు పలకల దేహానికి సంబంధించిన వార్కి ఎప్పుడు పులిస్టాప్ పడుతుందో చూడాలి.