Parasakthi On ZEE5 | కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన భారీ పీరియాడికల్ పొలిటికల్ డ్రామా ‘పరాశక్తి’ (Parasakthi) డిజిటల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకోగా.. ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
టాలెంటెడ్ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. 1960ల నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో అద్భుతమైన నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందించారు. శివకార్తికేయన్ కెరీర్లో ఇది 25వ సినిమా కావడం, అలాగే సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్కు ఇది 100వ చిత్రం కావడం విశేషం. జయం రవి ప్రతినాయకుడిగా నటించగా, అథర్వ మురళి కీలక పాత్రలో కనిపించారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. సుమారు 150 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో సినిమా విడుదలైన కేవలం నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు జీ5 వేదికగా ఈ యాక్షన్ డ్రామాను వీక్షించవచ్చు.