అమీర్‌ఖాన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘తారే జమీన్ పర్’ (2007) చిత్రం స్ఫూర్తివంతమైన కథాంశంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. బాల్యంలో తలెత్తే డిస్లెక్సియా (చదవడం, అభ్యాసం తాలూకు వైకల్యం) అనే మానసిక రుగ్మత గురించి ఈ సినిమాలో చర్చించారు. ‘తారే జమీన్ పర్’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో పాటు దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘సితారే జమీన్ పర్’ జూన్ 20న విడుదలకు సిద్ధమవుతున్నది.
ఆర్.ఎస్.ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమీర్‌ఖాన్, జెనీలియా ప్రధాన పాత్రధారులు. స్పానిష్ చిత్రం ‘ఛాంపియన్స్’ ఆధారంగా తెరకెక్కించారు. మానసిక దివ్యాంగులతో కూడిన బాస్కెట్ బాల్ బృందం వరుసగా 12సార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలవడమే ఈ చిత్ర ఇతివృత్తం. తాజా ఇంటర్వ్యూలో అమీర్‌ఖాన్ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
విధివంచితుల జీవితాల్లో ఆశల్ని చిగురింపజేసేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. ‘ఇందులో మొత్తం పదిమంది హీరోలుంటారు. వారిలో కొందరు ఆటిజమ్ సమస్యతో, మరికొందరు వివిధ మానసిక వైకల్యాలతో బాధపడుతుంటారు. మానసిక దివ్యాంగులైన నటులతో పాటు వివిధ వైకల్యాలతో సతమతమవుతున్న వ్యక్తులు ఈ సినిమాలో నటించారు. వారి సహజమైన నటన హృదయాల్ని కదిలిస్తుంది’ అని చెప్పారు.