Sitaare Zameen Par | బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తన తదుపరి చిత్రం ‘సితారే జమీన్ పర్’ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత, నేరుగా యూట్యూబ్‌లో పే-పర్-వ్యూ (Pay-per-view) మోడల్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు యూట్యూబ్‌లో కొంత నిర్ణీత రుసుము చెల్లించి మాత్రమే వీక్షించాల్సి ఉంటుంది.
సాధారణంగా సినిమాలు థియేట్రికల్ రన్ తర్వాత నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ వంటి మేజర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతాయి. అయితే, ఆమిర్ ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి, నేరుగా అందరికి అందుబాటులో ఉన్న ఓటీటీ వేదిక యూట్యూబ్‌లో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించడం బాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వినూత్న విధానం ప్రేక్షకులకు ఎంతవరకు చేరువవుతుందో వేచి చూడాలి. ఎందుకంటే యూట్యూబ్ కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అవ్వడం వలన.. పెద్ద తేడా ఏమి ఉండదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకుముందు వచ్చిన పలు హాలీవుడ్ సినిమాలు కూడా ఇలాగే యూట్యూబ్‌లో విడుదల చేశాయని సినీ వర్గాలు అంటున్నాయి.