ఓ శకం ముగిసింది. మూడు దశాబ్ధాల పాటు తెలుగు ప్రేక్షకులని అలరించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక శాశ్వతంగా మనకు దూరమయ్యారు. ఈ రోజు ఉదయం ఫిలిం ఛాంబర్లో సిరి వెన్నెల పార్ధివ దేహాన్ని ఉంచగా, కడసారి చూపు చూసేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఫిలిం ఛాంబర్ నుండి మహాప్రస్ధానం వరకు సిరివెన్నెల అంతిమయాత్ర సాగింది. మహాప్రస్థానంలో కొద్ది సేపు వారి ఆచారం ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులు, అభిమానులు, పలువురు ప్రముఖుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.
సిరివెన్నెల ఇక మనకు కనిపించరని తెలిసి అభిమానులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నపాటి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లాడని, సజీవంగా తిరిగి వస్తాడని భావించిన అభిమానులందరికి తీరని శోకాన్ని మిగిల్చారు సిరివెన్నెల. సిరివెన్నెలకు ఆరేళ్ల క్రితం క్యాన్సర్ వచ్చింది. దీంతో ఆయనకు సగం ఊపిరితిత్తులు తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బైపాస్ సర్జరీ కూడా జరిగింది. సిరివెన్నెల గత ఐదు రోజులుగా ఎక్మో మిషన్ పైనే ఉన్నారు. ఎక్మో మిషన్ పై ఉన్న తర్వాత.. క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, ఒబీస్ పేషెంట్ కావడం, కిడ్నీ డ్యామేజ్ కావడంతో ఇన్ఫెక్షన్ శరీరమంతా సోకింది. దీంతో మంగళవారం 4 గంటల 7 నిమిషాల ప్రాంతంలో సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు అని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.
గత ఏడాది మరణించిన బాలు మరణ వార్తని ఇంకా ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితిలో లేరు. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు సిరివెన్నెల హఠాన్మరణం ప్రతి ఒక్కరిని శోకసంద్రంలోకి నెట్టింది. ఆయన మృతితో తెలుగు సాహిత్యం ఒక్కసారిగా మూగబోయినట్టుగా అనిపిస్తుంది. పాట ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయిందా… అన్నట్టుగా ఉందని భావోద్వేగానికి గురవుతున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం నిస్సందేహంగా సాహిత్య ప్రపంచానికే ఓ తీరని లోటు.అశ్లీలతని జోడించకుండా అద్భుతమైన పాటలు రాసిన సిరివెన్నెల ఇక లేరనే విషయం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది.