Sonu Nigam | ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 3న నమోదు చేసిన తనపై నమోదైన ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలని కోరారు. తదుపరి దర్యాప్తును నిలిపివేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. సింగిల్ జడ్జి శివశంకర్ అమరన్నవర్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ మంగళవారం ఈ కేసును విచారించింది. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఇటీవల ఆయన బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఈ సింగర్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సోనూ నిగమ్ ఓ సంగీత కచేరి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆయన పాటలు పాడుతున్న సమయంలో ఓ అభిమాని కన్నడ పాట పాడాలని కోరగా.. సోనూ నిగమ్ కన్నడ భాషను అవమానించేలా, భాషా విద్వేషాన్ని ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ కర్ణాటక రక్షణ వేదిక బెంగళూరు సిటీ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు సోనూ నిగమ్‌పై మూడు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గాయకుడి వ్యాఖ్యలు కన్నడిగు సమాజానికి తీవ్ర బాధ కలిగించాయని పిటిషనర్ ఆరోపించారు. కన్నడ పాట పాడలన్న సాధారణ రిక్వెస్ట్‌ను పహల్గామ్ ఉగ్రవాద దాడితో ముడిపెట్టి అసహనం, హింసాత్మకంగా చిత్రీకరించారని, ఇది శాంతి.. ప్రేమ, సామరస్య స్వభావానికి విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను సోను నిగమ్ తోసిపుచ్చారు. నిజాయతీగా చెప్పాలంటే, కర్నాటక రాష్ట్రం, కన్నడ భాష, సంస్కృతి, కళాకారులపై తనకు అపారమైన ప్రేమ, గౌరవం ఉందని తెలిపారు.
తాను హిందీ పాటల కన్నా ఎక్కువగా కన్నడ పాటలనే ఆస్వాదిస్తానని.. బెంగళూరులో ప్రదర్శనకు ముందు ఎక్కువ సమయం కన్నడ పాటల సాధనకే కేటాయిస్తానన్నారు. కచేరి జరిగిన రోజున తన వయసులో సగం కూడా లేని ఓ వ్యక్తి వేలాది మంది ముందు నన్ను అమర్యాదగా బెదిరించడం తనను బాధించిందన్నారు. షో ఇప్పుడే మొదలైందని.. ప్రణాళిక ప్రకారమే కొనసాగుతుందని అతనికి మర్యాదగానే సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. సాంకేతిక కారణాలను ప్రస్తావించానని.. ముందుగానే ఎంపిక చేసిన పాటల జాబితా ఉంటుందని చెప్పినట్లు తెలిపారు. దానికి అనుగుణంగానే గాయకులు, సాంకేతిక నిపుణులు సైతం సిద్ధంగా ఉంటారని.. హఠాత్తుగా వేరే పాటలు పాడమని అడిగితే సాధ్యం కాదని చెప్పినట్లు తెలిపారు.