న్యూఢిల్లీ: కరోనా బారినపడ్డ ప్రముఖ గాయని, భారతరత్న లతామంగేష్కర్ ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. ముంబైలోని బ్రీచ్ స్వీట్ ఆస్పత్రిలో ఆమె అత్యవసర చికిత్స పొందుతున్నారు. కరోనాకు తోడు ఆమెకు న్యుమోనియా కూడా ఉండటంతో వైద్యులు వెంటిలేటర్ పెట్టారని, ప్రస్తుతం ఆమె ఆక్సిజన్ సపోర్టుతోనే శ్వాస తీసుకుంటున్నారని లతామంగేష్కర్ మేనకోడలు రచనా షా తెలిపారు.
ప్రస్తుతం లతామంగేష్కర్ కోలుకుంటున్నారని, నిన్నటికి, ఇవాళ్టికి ఆమె ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని రచనా షా చెప్పారు. వయసు పైబడటంతే ఆమెకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయని, వైద్యులు ప్రత్యేక కేర్ తీసుకుని ఆమెను ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమె ఇంకా వారం, పదిరోజులపాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందన్నారు.
కాగా, లతా మంగేస్కర్ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రధాని నరేంద్రమోదీ ఆరా తీశారు. మంగళవారం బ్రీచ్ స్వీట్ ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసిన ప్రధాని.. లతా ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.