హీరో కార్తీక్ ఆర్యన్‌పై బాలీవుడ్ పెద్దలు కుట్ర చేస్తున్నారని, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ తరహాలోనే ఆయన్ని మానసికంగా వేధించి ఇండస్ట్రీ నుంచి పక్కకు తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు సంగీత దర్శకుడు, సింగర్ అమాల్ మాలిక్. హిందీ సినీరంగానికి చెందిన బడా నిర్మాతలు, తారలు ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నారని ఆయన ఆరోపించారు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. బాలీవుడ్ ప్రపంచం తాలూకు చీకటి కోణం భయంకరంగా ఉంటుందని, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ను నైతికంగా దెబ్బతీసి ఆయన్ని ఆత్మహత్యకు పురిగొల్పారని, కార్తీక్ ఆర్యన్ విషయంలో కూడా అదే రకమైన వ్యూహాల్ని అమలు చేస్తున్నారని అమాల్ మాలిక్ అన్నారు.
‘కొత్తవాళ్లు ఎదిగితే ఇక్కడ తట్టుకోలేరు. వారిని అణగదొక్కాలని ప్రయత్నిస్తారు. కార్తీర్ ఆర్యన్‌కు ఎలాంటి సినీ నేపథ్యం లేదు. అయినా కష్టపడి పైకొచ్చాడు. అది పెద్దలకు కంటగింపుగా మారింది. ఆయన్ని తొక్కేయాలని ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయితే కార్తీక్ ఆర్యన్‌కు ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం వల్ల సరైన మార్గంలో పయనిస్తున్నాడు. అయినా ఆయన విషయంలో కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. కార్తీక్ ఆర్యన్ జాగ్రత్తగా ఉండటం మంచిది’ అంటూ అమాల్ మాలిక్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన మాటలు బాలీవుడ్లో సంచలనంగా మారాయి.