Simran Responds to ‘Dabba Roles’ Controversy | కోలీవుడ్ స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ఇటీవల చేసిన ‘డబ్బా రోల్స్’ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఆమె మరోసారి స్పందించారు. తాను ఏ నటిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని.. కానీ తనతో ఒక నటి చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని సిమ్రాన్ తెలిపారు.
అసలు వివాదం ఏమిటంటే
ఒక అవార్డు వేడుకలో సిమ్రాన్ మాట్లాడుతూ, తాను ఇటీవల ఒక సినిమా చూసి తన సహనటికి మెసేజ్ చేశానని, అందులో ఆమె నటన బాగుందని మెచ్చుకుంటూ మెసేజ్ పంపించానని చెప్పారు. అయితే దానికి ఆ నటి, “ఆంటీ రోల్స్ చేయడం కంటే ఇది ఎంతో బెటర్” అని సమాధానం ఇచ్చిందని సిమ్రాన్ తెలిపారు. ఈ మాటలు తనను బాధించాయని, పనికిమాలిన ‘డబ్బా రోల్స్’లో నటించడం కంటే ఆంటీ లేదా 25 ఏళ్ల కూతురికి తల్లి పాత్రలు చేయడం ఎంతో బెటర్ అని సిమ్రాన్ వ్యాఖ్యానించారు.
సిమ్రాన్ చేసిన ‘డబ్బా రోల్స్’ వ్యాఖ్యలు జ్యోతికను ఉద్దేశించే చేశారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సిమ్రాన్ నటి పేరును మాత్రం బయటపెట్టలేదు.
సిమ్రాన్ స్పందిస్తూ, తన కోస్టార్ చేసిన కామెంట్స్ తనను ఎంతగానో బాధించాయని, ఆ బాధతోనే అవార్డుల కార్యక్రమంలో తనకు అనిపించింది చెప్పానని తెలిపారు. కెరీర్ ప్రారంభం నుంచే అప్పుడప్పుడు ఆంటీ రోల్స్ లో నటిస్తూ వచ్చానని, ఆ రోల్స్ చేయడం తనకూ ఇష్టమేనని, ఆ పాత్రల్లో నటించడంలో తప్పేముందని ప్రశ్నించారు. “నేను నా 25వ ఏటనే ‘కన్నతిల్ ముతమిట్టాల్’ సినిమాలో తల్లి పాత్ర చేశాను. అలాంటి పాత్రలు చేయడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. పనికిమాలిన పాత్రలు చేయకుండా, మనకు నమ్మకం ఉన్న పాత్రలు చేయాలి. ఏ పని చేసినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి” అని సిమ్రాన్ అన్నారు.
అంతేకాకుండా, సినీ పరిశ్రమలో హీరోయిన్లు ఎప్పటికీ ఒకరికొకరు స్నేహితులు కాలేరని, తనకు ఎదురైన అనుభవంతో అది మరోసారి రుజువైందని ఆమె పేర్కొన్నారు. స్నేహితులు అనుకున్నవారు కూడా కొన్ని సందర్భాల్లో తమ వ్యాఖ్యలతో బాధపెడతారని తెలిపారు. అవార్డుల కార్యక్రమంలో తాను మాట్లాడిన తర్వాత ఆ నటి తనకు మళ్లీ ఫోన్ చేసిందని, అయితే అంతకుముందు ఉన్న బంధం ఇప్పుడు లేదని సిమ్రాన్ స్పష్టం చేశారు.