అగ్ర కథానాయిక శృతిహాసన్‌కు సంగీతంలో చక్కటి ప్రావీణ్యం ఉన్న విషయం తెలిసిందే. ఆమె మంచి గాయని కూడా. ఇప్పటికే పలు ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా తన ప్రతిభను చాటింది. నేడు విడుదలవుతున్న ‘థగ్‌లైఫ్’ చిత్రంలో శృతిహాసన్ పాడిన ‘విన్వేలి నాయగా..’ అనే పాట బాగా పాపులర్ అయింది. అర్థవంతమైన సాహిత్యం, రెహమాన్ అద్భుత స్వరరచన, శృతిహాసన్ మెస్మరైజింగ్ వాయిస్‌తో ఈ సాంగ్ సంగీతప్రియుల్ని ఆకట్టుకుంటున్నది. నాన్న కమల్‌హాసన్ నటించిన ‘థగ్‌లైఫ్’ చిత్రంలో పాట పాడటం ఓ జీవితకాల అనుభవమని శృతిహాసన్ ఆనందం వ్యక్తం చేసింది. ఇలాంటి అవకాశం వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని చెప్పింది.
‘తండ్రి సినిమాలో పాట పాడే అదృష్టం ఎంత మంది కూతుళ్లకు దక్కుతుందో తెలియదు. నిజంగా ఇదొక లైఫ్‌టైమ్ ఎక్స్పీరియన్స్. పాటను అద్భుతంగా ఆలపించానని రోజూ వందలకొద్ది మెసేజ్‌లు వస్తున్నాయి. ఇంటివద్ద పియానో మీద ఈ పాట ట్రాక్‌ను రిహార్సల్ చేశాను. అందుకే రికార్డింగ్ సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. నా కెరీర్లో మెమొరబుల్ సాంగ్ ఇది’ అని శృతిహాసన్ పేర్కొంది. ఇటీవల చెన్నైలో జరిగిన ‘థగ్‌లైఫ్’లో ఆడియో ఈవెంట్లో ఈ పాటకు లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది శృతిహాసన్. మణిరత్నం దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించిన ‘థగ్‌లైఫ్’ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తున్నది.