Shraddha Srinath | మలయాళ సినీరంగంపై జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ అనంతరం ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ అంశాలు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంపై పలువురు సినీ తారలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్, మహిళల భద్రత గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్ జరిగేది నిజమేనని, అయితే తాను మాత్రం అలాంటి చేదు అనుభవాలను ఎప్పుడూ ఎదుర్కోలేదని చెప్పింది.
నిజం చెప్పాలంటే సినీరంగంలో కంటే బయటి సమాజంలోనే మహిళలకు రక్షణ కరువైందని అభిప్రాయపడింది. ‘ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోవాలి. సమాజంలో మహిళలపై దారుణమైన నేరాలు జరుగుతున్నాయి. ఒంటరిగా కారులో వెళ్లాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. మహిళలు ఒంటరిగా ప్రయాణం చేస్తూ ధైర్యంగా ఉండలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి’ అని శ్రద్ధా శ్రీనాథ్ చెప్పుకొచ్చింది. నానితో కలిసి నటించిన ‘జెర్సీ’ సినిమాతో ఈ భామ తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది. అనంతరం వెంకటేష్ సరసన ‘సైంధవ్’ చిత్రంలో కూడా నటించింది.