Sholay | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం మనందరికి తెలిసిందే. తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ఎన్నో జ్ఞాపకాలను పంచుకుంటూ ఉంటారు. తన వ్యక్తిగత జీవితం, సినిమాల విశేషాలు, ఇతర నటులపై తన అభిప్రాయాలను తన బ్లాగ్‌లోనూ పంచుకోవడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన తన బ్లాగ్ ద్వారా 1975లో విడుదలైన క్లాసిక్ మూవీ ‘షోలే’ కు సంబంధించిన ఓ అరుదైన జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకున్నారు . అది ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ టికెట్ కాగా, అది అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఇండియన్ సినిమాకు మైలురాయిగా నిలిచిన ‘షోలే’ ఈ ఏడాది అర్ధ శతాబ్దం పూర్తి చేసుకుంటోంది. 1975, ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా, అప్పటి నుంచి ఇప్పటి వరకు సినీఅభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. బాలీవుడ్లోనే కాదు, భారతీయ చలనచిత్ర రంగంలోనే ఓ దిగ్గజ సినిమాగా నిలిచిపోయిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా, అప్పట్లో వసూళ్ల పరంగా రికార్డులు తిరగరాసింది. తాజాగా అమితాబ్ బచ్చన్ తన వద్ద ఉన్న షోలే టికెట్‌ను షేర్ చేశారు. ఆ టికెట్‌పై చూపించిన రేటు రూ. 20. అప్పటి తరహాలో చూస్తే, చాలా థియేటర్లలో టికెట్ ధరలు రూ. 5 నుంచి రూ. 10 వరకు మాత్రమే ఉండేవి. అయితే ఇది స్పెషల్ క్లాస్ టికెట్ కావడంతో పాటు, ప్రముఖ ప్రైమ్ ఏరియాలోని థియేటర్‌కి చెందినది కావడంతో టికెట్ ధర ఎక్కువగా ఉండేది.
అయినా కూడా, షోలే సినిమాకు ఆదరణ అంత ఎక్కువగా ఉండటంతో టికెట్ రేట్లు పెరిగినా ప్రేక్షకులు పోటెత్తే వారు. రమేష్ సిప్పీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, మంచి కథ, నటన, సాంకేతికత, సంగీతం, సంభాషణలతో ప్రేక్షకులను ఆహ్లాదపరిచింది. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమామాలిని, సంజీవ్ కుమార్, అమజద్ ఖాన్ వంటి నటుల అద్భుత నటన ఈ సినిమాను చరిత్రలో నిలిపింది. ఈ సినిమా అమితాబ్ బచ్చన్‌కు భారీ స్థాయిలో స్టార్డమ్ తీసుకొచ్చింది. ధర్మేంద్ర కూడా ఈ సినిమాతో పాపులర్ అయ్యారు. ‘షోలే’ సినిమా కొన్ని థియేటర్లలో అయిదేళ్ల వరకు నడిచింది. పలు మార్పులు చేస్తూ సినిమాని రిలీజ్ చేసిన కూడా బాగానే ఆడింది. కొన్ని చోట్ల పదుల సంవత్సరాలపాటు ప్రతిరోజూ ఒక్క షో అయినా షోలే సినిమా ప్రదర్శించారు. ఇది భారతీయ సినిమాల్లో అరుదైన ఘట్టం. షోలే సినిమా విడుదలై 50 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో, వచ్చే నెలలో బాలీవుడ్లో గ్రాండ్ సెలబ్రేషన్స్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో అప్పట్లో సినిమా భాగస్వాములైన చాలా మంది నటులు పాల్గొననున్నారు.