Shivaji Raja | ఇటీవల తెలుగు భక్తులు పెద్ద సంఖ్యలో అరుణాచలాన్ని దర్శించడం మనం చూస్తూనే ఉన్నాం. చాగంటి కోటేశ్వరరావు గారు అరుణాచలం మహిమను వివరించిన తర్వాత మరింతగా తెలుగు భక్తుల రద్దీ పెరిగింది. అయితే, భక్తితో వెళ్లి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాల్సిన చోట కొంతమంది ఫోటోలు, వీడియోలు, వ్లాగ్స్ అంటూ హడావిడి చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రమణ మహర్షి ఆశ్రమం సైలెన్స్‌ను భంగం చేస్తుండటంపై స్థానిక తమిళులు కూడా అప్పుడప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో అరుణాచలంలో జరుగుతున్న ఈ హంగామా గురించి సీనియర్ నటుడు శివాజీ రాజా స్పష్టం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అరుణాచలం గురించి ఎవరికీ తెలియనప్పుడు నుంచే నేను, మా మిసెస్, మా ఫ్యామిలీ 30 ఏళ్లుగా వెళ్తున్నాం. అక్కడ నాకు ల్యాండ్ కూడా ఉంది. ఇల్లు కట్టుకోవాలనుకున్నా కుదరలేదు. మేము సింపుల్‌గా దండం పెట్టుకొని వచ్చేస్తాం. నేను, రాజా రవీంద్ర రెగ్యులర్‌గా వెళ్తుంటాం అని తెలిపారు. ఇక ఇటీవలి రద్దీ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు 25 శాతం మంది అరుణాచలంని ఒక వెకేషన్ ట్రిప్‌లా చూస్తున్నారు. అది చూసి స్టేటస్ పెట్టుకోవాలి, ఫోటోలు తీయాలి, వీడియోలు తీయాలి అనుకునే వాళ్లు పెరిగారు. వాళ్లు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ నాశనమే అన్నారు. రమణాశ్రమం చాలా సైలెంట్‌గా ఉంటుంది. అక్కడి వాతావరణం భక్తితో నిండిపోతుంది. వెంకటేష్, ఇళయరాజా లాంటి వారు కూడా చాలా ప్రశాంతంగా దర్శనం చేస్తారు. కానీ ఒకసారి నేను, రాజా రవీంద్ర వెళ్లినప్పుడు కొంతమంది ఫోటోలు, సెల్ఫీలు అని అరుస్తూ అల్లరి చేశారు.
ఫారెనర్లు వచ్చి వారిని సైలెన్స్ అంటూ హెచ్చరించారు. మనవాళ్లు పూజ చేయడంలో భక్తి చూపుతారు కానీ అతిగా చేసి వాతావరణాన్ని చెడగొడతారు అని అన్నారు. అక్కడికి భక్తి కోసం వెళ్లే వాళ్లు 75%. కానీ మిగతా 25 శాతం మంది ఫోటోలు, వ్లాగ్స్ కోసం వెళ్లి అక్కడి పవిత్రతను చెడగొడుతున్నారు. దీనిని చూసి మనసుకు బాధగా ఉంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే” అని శివాజీరాజా చెప్పారు. శివాజీ రాజా ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, చాలా మంది నెటిజన్లు ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది ప్రాంతీయ వివాదం రేకెత్తించే విషయం కాదని, భక్తులు ప్రశాంతంగా ఉండాలన్న సూచన మాత్రమేనని అంటున్నారు.