Shivaji | టాలీవుడ్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన చిత్రాల్లో ‘దండోరా’ ఒకటిగా నిలుస్తోంది. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాణంలో, మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ కీలక పాత్రల్లో నటించగా, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బింధు మాధవి, రాధ్య, అదితి భావరాజు వంటి నటీనటులు భాగమయ్యారు. గ్రామీణ నేపథ్యంతో, సామాజిక స్పృహ కలిగించే అంశాలను స్పృశిస్తూ రూపొందిన ఈ సినిమా గ్లింప్స్, టీజర్, పాటలతో ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకుంది. తెలంగాణ గ్రామీణ సంస్కృతి, కులవ్యవస్థలోని అణచివేతలు, ఇంటర్‌కాస్ట్ ప్రేమ వివాహాలపై జరిగే దౌర్జన్యాలను భావోద్వేగం, వ్యంగ్యంతో చెప్పడం ఈ చిత్ర ప్రత్యేకతగా నిలుస్తోంది.
ఇటీవల నిర్వహించిన ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం ఊహించని విధంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమంలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పద్ధతిగా ఉండాలని చెప్పే క్రమంలో ఉపయోగించిన కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరోవైపు, ఆయన మాటల్లో భావం ఉందని కొందరు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా చర్చ కొనసాగుతోంది.ఇదిలా ఉండగా, అదే వేదికపై శివాజీ చేసిన మరో వ్యాఖ్య టాలీవుడ్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకు సంబంధించిన ట్విస్ట్‌ను లీక్ చేస్తూ, ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్లో కనిపించనున్నారని శివాజీ వెల్లడించారు. “ఈ సినిమాలో ఇద్దరు ఉంటారు. వాళ్లిద్దరు కలిసిన తర్వాతే అసలు సినిమా ఉంటుంది” అంటూ చెప్పడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. అయితే శివాజీ లీక్ ఇస్తానంటూ మాట్లాడుతుండగానే, పక్కనే ఉన్న అనిల్ రావిపూడి మైక్ లాక్కునేందుకు ప్రయత్నించడం నవ్వులు పూయించింది. చివరికి ఏమీ చెప్పకపోవడంతో అనిల్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.