‘దండోరా’ ప్రీరిలీజ్ వేడుకలో హీరోయిన్ల వస్త్రధారణపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, అయితే ఆ సమయంలో వాడిన రెండు అసభ్య పదాల విషయంలో మాత్రం క్షమాపణ చెబుతున్నానని నటుడు శివాజీ అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ‘దండోరా’ ప్రీరిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. వేదికపై రెండు అనుచిత పదాలు ఉపయోగించినందుకు శివాజీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. వేదిక దిగిన తర్వాత తాను చేసిన తప్పేమిటో గ్రహించానన్నారు.
‘ఆరోజు స్టేజీ మీదున్న నా తోటి నటీనటులకు, ఆడబిడ్డలకు క్షమాపణలు. ఆ రెండు పదాలను మాట్లాడకుండా ఉండాల్సింది. నా 30 ఏళ్ల నట జీవితంలో అలాంటి పదాలు ఎప్పుడూ ఉపయోగించలేదు. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. నేను నిద్రపోయి 36 గంటలైంది. నాపై నమ్మకంతో నిర్మాత సినిమా అవకాశమిస్తే అలా ఎందుకు జరిగిందని నాలో నేను అంతర్మథనానికి లోనయ్యాను. అయితే నేను ఇచ్చిన స్టేట్మెంట్కు మాత్రం కట్టుబడే ఉంటా. దాంట్లో ఎవరికీ భయపడేది లేదు. ఆ రెండు పదాలు మాత్రం అభ్యంతరకరం కాబట్టి మనస్సాక్షిగా క్షమాపణ చెబుతున్నా’ అని శివాజీ పేర్కొన్నారు.