Shivaji | నటుడు శివాజీ ఇటీవల మహిళలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన కామెంట్లు వైరల్ కావడంతో, న్యూస్ ఛానెల్స్‌లో డిబేట్లు, సెలబ్రిటీల స్పందనలు, కౌంటర్లు, చివరికి శివాజీ క్షమాపణలు చెప్పడం వరకు ఈ వ్యవహారం నిత్యం చర్చనీయాంశంగా మారింది. అనసూయ, చిన్మయి, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ వంటి పలువురు నటీమణులు స్పందించగా, మరోవైపు చాలామంది మహిళలు శివాజీకి మద్దతుగా నిలవడం కూడా గమనార్హం.ఈ నేపధ్యంలో తాజాగా శివాజీ ఈ వివాదం సహా పలు అంశాలపై స్పందించారు.
శివాజీ ప్రధాన పాత్రలో నటించిన ‘దండోరా’ సినిమా గురువారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కులం అనే సున్నితమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో నందు, బిందు మాధవి, నవదీప్, రవికృష్ణ కీలక పాత్రలు పోషించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని శుక్రవారం చిత్ర బృందం థ్యాంక్స్‌మీట్ నిర్వహించింది.ఈ కార్యక్రమంలో శివాజీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలో తనకు బిందు మాధవితో ఉన్న లవ్ ట్రాక్‌ను పెద్దగా చూపించలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ, “మనిషి జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక కంపెనీ కావాలి. ఎక్కడో ఓ చోట కనెక్షన్ దొరుకుతుంది. ఈ జీవితంలో ఎవరు ఎందుకు కలుస్తారో ఎవరికీ తెలియదు. నోట్లో నుంచి ఎప్పుడు ఏం వస్తుందో కూడా తెలియదు. కానీ నేచర్‌లో ప్రతిదానికి ఓ కారణం ఉంటుంది” అని అన్నారు. పరోక్షంగా తన మాటల వెనుక కూడా కారణం ఉందన్న సంకేతాన్ని ఇచ్చారు.
అయితే తనపై నడుస్తున్న వివాదం గురించి స్పందిస్తూ శివాజీ కీలక హెచ్చరిక చేశారు. “ప్లీజ్ నా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకండి. వాటి గురించి కాకుండా ‘దండోరా’ సినిమాను ప్రమోట్ చేయండి. లేదంటే ఆ నింద నేను మోయాల్సి వస్తుంది. మాట్లాడాలంటే నేను థియేటర్‌కు వచ్చి మాట్లాడతాను” అంటూ స్పష్టం చేశారు. పరోక్షంగా ఇకపై ఈ వివాదంపై రచ్చ చేయవద్దని సూచించారు. దండోరా సినిమాని రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేసి ఉంటే వేరే లెవల్లో ఉండేదని, సెన్సార్ కారణంగా ఆలస్యం జరిగిందని తెలిపారు. హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం తనకు గర్వంగా ఉందన్నారు. దర్శకుడు నీలకంఠ ఈ సినిమా తరాలకొకసారి వచ్చే చిత్రం అని చెప్పినట్లు వెల్లడించారు.ఈ సినిమా షూటింగ్ రోజుల్లో నేను రోజుకు కేవలం రెండు గంటలే నిద్రపోయేవాడిని. ఇందులో నాకు కొడుకు, కూతురు పాత్రలు ఉన్నాయి. వాటిని బ్యాలెన్స్ చేయాలంటే లుక్‌లో నిజాయితీ కనిపించాలి. దర్శకుడు అడగకపోయినా నేను చాలా కష్టపడ్డాను. అందరూ ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. ప్రేక్షకులు ఆదరించాలి” అని శివాజీ అన్నారు.