Shiva Rajkumar | థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కర్ణాటకలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ కన్నడ నాట ఎంత పెద్ద దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళం నుంచి కన్నడ పుట్టిందని ఆయన వ్యాఖ్యానించడంతో దీనిపై రాజకీయ నేతలు, నెటిజన్లు, ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు, కన్నడ ప్రజలు కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. భాష చరిత్ర గురించి ఎంతో మంది చరిత్రకారులు తనకు చెప్పారని , తాను చేసిన వ్యాఖ్యలలో మరో ఉద్దేశం లేదంటూ కమల్ వ్యాఖ్యానించారు.
ఈ వివాదం నేపథ్యంలో కమల్ హాసన్ తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు ది కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. దాంతో కమల్ హాసన్ తాజాగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.థగ్ లైఫ్‌ను రాష్ట్రంలో విడుదల చేసి ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు . అయితే కమల్ మాట్లాడుతున్నప్పుడు శివరాజ్ కుమార్ చప్పట్లు కొడుతున్నట్టుగా కొన్ని వీడియోలలో కనిపించగా, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కమల్ చేసిన తప్పుడు కామెంట్స్‌ని శివరాజ్ ప్రోత్సహిస్తున్నారని కొందరు నెటిజన్లు మండిపడడంతో దానిపై శివరాజ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ప్రతి భాషకూ గౌరవం ఉంటుంది. నా మాతృభాష కన్నడ. దానికి నా జీవితం కూడా అంకితం చేయడానికి సిద్ధం. ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను. కమల్ హాసన్ గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. ఆయన నా ఫేవరెట్ స్టార్. ఆయన సీనియర్, నేను అభిమానిగా చూస్తాను. అయితే ఈవెంట్లో కమల్ హాసన్ ఆ వ్యాఖ్యలు చెసినప్పుడు నేను క్లాప్స్ కొట్టలేదు. వేరే ఎవరో మాట్లాడుతున్న సమయంలో నేనే క్లాప్ చేశాను. కానీ ఎడిటింగ్‌లో ఆ దృశ్యం తప్పుగా చూపించారు. అప్పుడు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదని అన్నారు. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని తాను చెప్పకూడదని శివరాజ్ కుమార్ అన్నారు.