అగ్రహీరో రవితేజ తాజా సినిమా ‘మాస్ జాతర’ త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ఆయన కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ను చేస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా ఆ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఇదిలావుంటే.. వచ్చే ఏడాది రెండు సినిమాలను రవితేజ లైన్లో పెట్టినట్టు తెలుస్తున్నది. అందులో ఒక చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో శివ నిర్వాణ మంచి దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. ప్రస్తుతం ఆయన రవితేజ కోసం ఓ యాక్షన్ థ్రిల్లర్ కథను సిద్ధం చేశారట.
ఈ కథ రవితేజకు కూడా బాగా నచ్చిందట. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. దీనితోపాటు ‘కలర్‌ఫొటో’ దర్శకుడు సందీప్‌రాజ్ కథను కూడా రవితేజ ఓకే చేశారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే ఈ సినిమా వచ్చే ఏడాది మధ్యలో సెట్స్‌కు వెళుతుందని తెలిసింది. మొత్తంగా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు మాస్ మహారాజ్ రవితేజ.