Prakash Raj | గత కొద్ది రోజులుగా నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు, వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాజకీయ, సామాజిక అంశాలపై ఆయన వరుసగా స్పందిస్తూ వస్తుండగా.. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ నటుడు శివకృష్ణ గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో శివకృష్ణ.. ప్రకాష్ రాజ్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సనాతన ధర్మం, హిందూ మతంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఒక దశలో ఆయన ప్రవర్తన కారణంగా సినీ పరిశ్రమలో చర్యలు తీసుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
శివకృష్ణ చెప్పిన ప్రకారం.. గతంలో ప్రకాష్ రాజ్ ఒక వర్గానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలకిగాను తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో సినీ పరిశ్రమ పెద్దలు కలిసి ఆయనపై బ్యాన్ విధించాలని నిర్ణయించారని తెలిపారు. ఆ సమయంలో దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూడా అంతా చట్టబద్ధంగానే ఉంది.. ముందుకు వెళ్లండి అంటూ మద్దతు తెలిపారని, నాగార్జున కూడా ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించలేదని ఆయన గుర్తుచేశారు. అలాగే ఆ ఘటన తర్వాత ప్రకాష్ రాజ్ స్వయంగా తన వద్దకు వచ్చి సమస్యను పరిష్కరించాలని కోరారని శివకృష్ణ వెల్లడించారు. ప్రస్తుతం కూడా హిందూ మతం, సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ.. అలాంటి వ్యాఖ్యలను సినీ పరిశ్రమ ఉపేక్షించకూడదని అన్నారు.
ప్రకాశ్ రాజ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సినిమాల్లో అవకాశాల విషయంలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని శివకృష్ణ అభిప్రాయపడ్డారు. బ్యాన్ తర్వాత ప్రకాష్ రాజ్ స్వయంగా ఇంటికి వచ్చి నన్ను వదిలేయండి అని బతిమలాడుకున్నాడని శివకృష్ణ స్పష్టం చేశారు.. నాడు అంతలా దిగివచ్చిన వ్యక్తి.. ఈరోజు హిందూ మతంపై ఇన్ని దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంటే ఇండస్ట్రీ ఎందుకు సైలెంట్‌గా ఉందంటూ ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పాత వ్యాఖ్యల వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీస్తోంది.