Shine tom chacko | తెలుగు ప్రేక్షకుల్లో ‘దసరా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. ఈ సినిమా తరువాత ‘దేవర’ సహా పలు చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. అయితే కొన్ని నెలల క్రితం చాకోకు, నటి విన్సీ సోనీ అలోషియస్‌కు మధ్య జరిగిన వివాదం మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా, ఈ వివాదానికి ముగింపు పలకుతూ చాకో పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పడం జరిగింది. ఇద్దరూ కలిసి నటించిన ‘సూత్రవాక్యం’ సినిమా ప్రమోషన్ కోసం ఇద్దరూ ఒకే వేదికపై కనిపించారు. అక్కడే టామ్ చాకో మాట్లాడుతూ.. నా ప్రవర్తన వల్ల విన్సీకి కలిగిన బాధకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. కావాలని అలా చేయలేదు. సరదాగా మాట్లాడిన మాటలే అవి. కానీ ఆ మాటలు ఇంతవరకూ వెళ్తాయని ఊహించలేదు అని చెప్పుకొచ్చారు.
అలాగే, విన్సీ స్పందించిన తీరు గురించి మాట్లాడుతూ .. ఆమెని ఎవరైన ప్రేరేపించారేమో అనిపించింది అని అన్నాడు టామ్ చాకో. ఇక టామ్ మాటలకి విన్సీ వెంటనే స్పందిస్తూ.. ఆ సమయంలో నిజంగానే నాకు అసౌకర్యంగా అనిపించింది. అతను అలా ప్రవర్తిస్తారని అనుకోలేదు. నేను స్పందించిన తీరు కూడా అతని కుటుంబాన్ని బాధించింది. ఇప్పుడు వివాదం ముగిసింది అని చెప్పుకొచ్చింది. ఆ వెంటనే మాట్లాడిన చాకో నిజంగా నేను నిన్ను బాధపెట్టి ఉంటే క్షమించు అని అన్నాడు. దాంతో విన్సీ.. ఆ మాట నా మనసును తాకింది. ఇప్పుడు ఆయనపై గౌరవం మరింత పెరిగింది అని చెప్పుకొచ్చింది.
2023 ఏప్రిల్‌లో ఒక ఇంటర్వ్యూలో విన్సీ.. “షైన్ టామ్ చాకో సెట్స్‌లో అసౌకర్యంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని మలయాళ ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశాను. చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశం లేదు. కానీ ఇండస్ట్రీలో మహిళల హక్కులకు పెద్దలు స్పందించాలి అని చెప్పినట్టు పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ వివాదానికి ముగింపు పలకడంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. బాధ్యతగా ప్రవర్తించి పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పిన షైన్ టామ్ చాకో, సంయమనంతో స్పందించిన విన్సీ ఇద్దరూ ప్రొఫెషనల్‌గా ముందుకు సాగుతున్న తీరు మెచ్చుకోదగినది అని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇటీవల టామ్ చాకో కుటుంబాన్ని విషాదం వెంటాడింది. తమిళనాడులో రోడ్డు ప్రమాదంలో ఆయన తండ్రి సి.పి. చాకో మరణించగా, టామ్ చాకోతో పాటు ఆయన తల్లి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సేలం – బెంగళూరు జాతీయ రహదారిపై ధర్మపురి సమీపంలో జరిగింది.