Shihan hussaini| ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల మరణవార్తలు ఎక్కువగా వింటున్నాం. ఒకరి మరణవార్త మరిచిపోకముందే మరొకరు కన్నుమూస్తున్నారు. తాజాగా ప్రముఖ కోలీవుడ్ నటుడు, పవన్ కళ్యాణ్ గురువు షిహాన్ హుస్సేనీ కన్నుమూశారు. ఆయన వయస్సు 60 సంవత్సరాలు. కొద్దిరోజులుగా ఆయన లుకేమియాతో బాధపడుతుండగా, అతనిని చెన్నై ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అతని మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇతను తెలుగు ప్రేక్షకులకి అంతగా తెలియకపోవచ్చు, కాని ఆయన పవన్ కళ్యాణ్‌కి గురువు.
పవన్‌కు మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ హుస్సేనీ నేర్పించారు. ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటూనే పవన్ బ్లాక్ బెల్ట్ సాధించారు. హుస్సేనికి భార్య, కుమార్తె ఉన్నారు. హుస్సేనీ మమ్మల్ని విడిచిపెట్టారని తెలియజేయడానికి ఎంతో బాధగా ఉంది. హుస్సేనీ సాయంత్రం వరకు బెసెంట్ నగర్‌లోని తన నివాసంలో హైకమాండ్‌లో ఉంటారు అని అతని కుటుంబం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇక అతని కుటుంబం సమక్షంలో చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది.
ఇక హుస్సేని తన సోషల్ మీడియా పేజీలలో యాక్టివ్‌గా ఉంటూ నిరంతరం అప్డేట్లు ఇస్తూ ఉండేవారు. తన క్యాన్సర్ ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేశాడు. అతని పోస్ట్‌లను చూసిన తమిళనాడు ప్రభుత్వం అతని క్యాన్సర్ చికిత్స కోసం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం కూడా అందించింది. చనిపోవడానికి ముందు అతను తన శరీరాన్ని వైద్య పరిశోధన కోసం దానం చేయాలనుకుంటున్నట్టు తెలిజేశాడు. 1986లో కమల్ హాసన్ నటించిన పున్నగై మన్నన్ సినిమాతో నటుడిగా ఆరంగేట్రం చేసిన హుస్సేని రజనీకాంత్‌తో కూడా కలిసి పని చేశాడు. ఆయన నటించిన చివరి చిత్రాలు విజయ్ సేతుపతి నటించిన కాతువాకుల రెండు కాదల్ , చెన్నై సిటీ గ్యాంగ్ స్టర్స్. సినిమాలతో పాటు పలు రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా, వ్యాఖ్యాతగా కూడా అలరించారు.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయనకి మంచి పేరు ఉంది.