రెజీనా కసాండ్రా.. సహజ నటి. కాబట్టే, ప్రయోగాలకు ఏమాత్రం ఆస్కారం ఉన్నా.. తన ఇంటి కాలింగ్ బెల్ నొక్కుతారు. కాల్షీట్ల కోసం వెంటపడతారు. మార్చి పదహారు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షకులకు అందుబాటులోకి రానున్న రాకెట్ బాయ్స్-2లో మృణాళినీ సారాభాయి పాత్రలో తను కనువిందు చేయనుంది. ఈ సందర్భంగా రెజీనాతో ఓ చిట్‌చాట్..
నిజానికి, రాకెట్ బాయ్స్ తొలిభాగం సమయంలోనే నా పాత్రను చాలావరకూ షూట్ చేశారు. అందులో చాలావరకూ ఇప్పుడు వాడుకుంటున్నారు. అందులోనూ మా డైరెక్టర్ అభయ్కు వీక్షకుల నాడి తెలుసు. వివిధ కారణాల వల్ల తొలి సీజన్లో ప్రమోషన్ యాక్టివిటీస్‌కు దూరంగా ఉన్నాను. ఈసారి మాత్రం పబ్లిక్‌లోకి వెళ్లాల్సిందే.
ఓటీటీ.. నటులకు మంచి వేదిక. వీక్షకులకు షడ్రసోపేత భోజనం. సినిమా నిర్మాతలకు అదనపు ఆదాయం. కొత్త దర్శకులకు ఓ వరం. ఎలా చూసినా తిరుగులేని మాధ్యమం ఇది. ‘రాకెట్ బాయ్స్’తో ఈ వేదిక మీద అదృష్టాన్ని పరీక్షించుకున్నాను. మంచి పేరే తెచ్చుకున్నాను. తెలుగు, తమిళ వెబ్‌సిరీస్‌లు
నా స్థాయిని పెంచాయి.
మహిళా ఆర్టిస్టులకు ఓటీటీ ఓ ప్రయోగశాలగా మారింది. కొత్తకొత్త పాత్రలు వస్తున్నాయి. చాలా ఇతివృత్తాలు స్త్రీ జీవితం చుట్టే తిరుగుతున్నాయి. ఈ ట్రెండ్ పెద్ద తెరకు కూడా విస్తరిస్తే బావుంటుంది.
సినిమా రంగంలో పురుషులతో పోలిస్తే మా పారితోషికాలు తక్కువే. ఈ వివక్ష ప్రతి రంగంలోనూ ఉన్నదే. కాకపోతే, సినిమా పరిశ్రమ గురించి మాత్రమే చర్చిస్తున్నారు. ఏ కార్పొరేట్ ప్రపంచమో అయితే ఎవరూ నోరు విప్పరు. అంతే తేడా. కానీ, నేను పరిశ్రమకు వచ్చిన సమయంలో ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తున్నది. నా పన్నెండేండ్ల కెరీర్లో చాలా అనుభవాలే ఎదురయ్యాయి. కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. అంతే తేడా.