Shashtipoorthi | నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, సీనియర్ నటి అర్చన, యువ కథానాయకుడు రూపేష్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘షష్టి పూర్తి(Shashtipoorthi). కుటుంబ కథా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు యువ దర్శకుడు పవన్ ప్రభ దర్శకత్వం వహించగా.. మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ నిర్మించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా ఎలా.. ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
కథ విషయానికి వస్తే.. ఈ చిత్రం శ్రీరామ్ (రూపేష్) అనే యువ న్యాయవాది చూట్టు తిరుగుతుంది. చిన్నతనం నుంచే నీతి, న్యాయం అంటూ పెరిగిన శ్రీరామ్ న్యాయవాదిగా వాటిని కాపాడడానికి అంకితభావంతో పోరాడుతాడు. వృత్తిపరంగా అతను న్యాయాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తుండగా మరోవైపు అతని వ్యక్తిగత జీవితంలో జానకి (ఆకాంక్ష సింగ్) అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. అయితే ఈ విషయం ఇంట్లో చెబుదామంటే శ్రీరామ్ తల్లిదండ్రులు రాజేంద్ర ప్రసాద్, అర్చనలు చాలా రోజుల నుంచి మట్లాడుకోకుండా ఉంటారు. అయితే వీరిని కలుపుదామని జానకి, శ్రీరామ్ కలిసి షష్టిపూర్తి ప్లాన్ చేద్దామనుకుంటారు. ఈ క్రమంలోనే జరిగిన సంఘటనలు ఏమిటి.. అసలు రాజేంద్ర ప్రసాద్, అర్చనలు ఎందుకు మాట్లాడుకోరు.. అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
‘షష్టిపూర్తి’ చిత్రానికి ప్రధాన ఆకర్షణ శ్రీరామ్ తన తల్లిదండ్రుల మధ్య ఉన్న దూరాన్ని తొలగించి, వారిని తిరిగి ఏకం చేయడమే. ఈ ప్రయాణంలో ఎదురైన భావోద్వేగ సంఘటనలను దర్శకుడు పవన్ ప్రభ ఎంతో ఎమోషనల్గా ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా తెరకెక్కించాడు. ఈ చిత్రం కేవలం ఒక ప్రేమకథకు మాత్రమే పరిమితం కాదు, ఇది రెండు విభిన్న తరాలకు చెందిన ప్రేమను, బంధాలను అద్భుతంగా చిత్రీకరించింది. ఒకవైపు శ్రీరామ్, జానకి మధ్య ప్రేమను చూపిస్తూనే, మరోవైపు అతని తల్లిదండ్రుల మధ్య ఉన్న సంక్లిష్టమైన, దీర్ఘకాల సంబంధాన్ని లోతుగా ఆవిష్కరించింది. ఈ చిత్రం కుటుంబ విలువలు, తల్లిదండ్రుల పట్ల గౌరవం, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని గొప్పగా చూపిస్తుంది. దర్శకుడు పవన్ ప్రభ ఉమ్మడి కుటుంబ నేపథ్యం నుండి స్ఫూర్తి పొంది, తల్లిదండ్రులను విడిచిపెట్టే ప్రస్తుత సమాజంలో ఒక సమస్యను సున్నితంగా హైలైట్ చేశారు.
నటినటులు
అపార్థం చేసుకోబడిన భర్త పాత్రలో రాజేంద్ర ప్రసాద్ తన నటనతో హృదయాలను గెలుచుకున్నాడు. అతని భావోద్వేగ నటన చిత్రానికి బలమైన ఆధారంగా చెప్పవచ్చు. ఇక మూడు దశాబ్దాల తర్వాత తెలుగు సినిమాకు తిరిగి వచ్చిన అర్చన, భావోద్వేగమైన, సంక్లిష్టమైన పాత్రలో అద్భుతంగా నటించారు. రూపేష్ తన నటనతో సినిమాకు ప్రాణం పోశాడని చెప్పవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు గొడవ పడినప్పుడు ఒక కొడుకి పాత్రలో ఎలా ఉంటారో జీవించి చూపించాడు. ఆకాంక్ష సింగ్ కూడా తన సహజమైన నటనతో పాత్రకు జీవం పోసింది.
సాంకేతిక అంశాలు: తోట తరణి కళా దర్శకత్వం ఈ చిత్రానికి హైలైట్ అని చెప్పవచ్చే. ముఖ్యంగా గోదావరి ప్రాంతంలో చిత్రీకరించిన దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. రామ్ సినిమాటోగ్రఫీ, కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ చిత్రానికి మంచి నాణ్యతను అందించాయి. ఇళయరాజా సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది. పవన్ ప్రభ దర్శకత్వం సరళంగా ఉంటూనే భావోద్వేగాలను గొప్పగా చూపించింది. కుటుంబ విలువలు, తల్లిదండ్రుల పట్ల బాధ్యత, సంప్రదాయాలను గౌరవించే కథనం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
బలహీనతలు
కొన్ని సన్నివేశాలు కొంచెం సాగదీసినట్లు అనిపించవచ్చు కానీ అవి సినిమాను అంతగా ప్రభావం చూపవు.
రేటింగ్ 2.75/5