కీరవాణి పాట రాయడం. దానిని ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరచడం. ఆ పాటను దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేయడం. ఈ స్వర త్రివేణీ సంగమాన్ని అరుదుగా జరిగే ఆసక్తికరమైన విషయంగా పేర్కొనవచ్చు. రూపేష్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథాచిత్రం ‘షష్టిపూర్తి’. ఆకాంక్షసింగ్ కథానాయిక. రాజేంద్రప్రసాద్, అర్చన ముఖ్య పాత్రధారులు. పవన్ ప్రభ దర్శకుడు.
ఇళయరాజా సంగీత దర్శకుడు. ఈ సినిమా కోసం కీరవాణి రాసిన ‘ఏదో ఏ జన్మలోదో..’ అంటూ సాగే గీతాన్ని ఇళయరాజా స్వరపరిచారు. ఆనన్యభట్ పాడారు. దేవిశ్రీప్రసాద్ పాటను మంగళవారం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ పాటలో కథంతా చెప్పాలి. అందుకే కీరవాణిగారిని రాయమని అడిగాం. ఇళయరాజా సంగీతంలో పాట అనగానే ఆయన ఆనందంగా ఒప్పుకున్నారు. గొప్పగా రాశారు’ అని తెలిపారు.