Pawan Kalyan Johnny | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలంటే వారి అభిమానులకు ఎంత పిచ్చి అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ పాత సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయంటే చాలు కొత్త సినిమా విడుదలకు ఉన్నంతా సందడి చేస్తారు అభిమానులు. ఇక పవన్‌కి ఉన్న క్రేజ్‌ని వాడుకొని ఇప్పుడున్న కుర్ర హీరోలు కూడా వారి సినిమాలకు పవన్ సినిమా టైటిల్స్ పెడుతుంటారు.
ఇప్పటికే పవన్ సూపర్ హిట్ సినిమా అయిన తొలిప్రేమ టైటిల్‌ని వరుణ్ తేజ్ వాడుకోగా ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పవన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఖుషి సినిమా టైటిల్‌ని విజయ్ దేవరకొండ వాడుకున్నాడు. కానీ ఈ సినిమా అనుకున్నంతా పెద్దగా హిట్ అవ్వలేదు. ఇప్పుడు ఇదే తరహాలో మరో రెండు పవన్ సినిమా టైటిల్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో ఒకటి నితిన్ హీరోగా తెరకెక్కుతున్న తమ్ముడు అనే సినిమా కాగా.. మరోకటి శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం.
Sharwa36 అంటూ ఒక ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ సినిమాకి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో నటించబోతున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్‌కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీలో శర్వ బైక్ రేసర్‌గా కనిపించబోతుండగా.. దీనికి జానీ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ రాబోతున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జానీ. ఈ చిత్రంలో రేణూ దేశాయ్ కథానాయికగా నటించింది. ఈ సినిమా విజయం సాధించకపోయిన పవన్ అభిమానులకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. అయిదే ఇదే టైటిల్‌ను ఇప్పుడు మళ్లీ శర్వా తీసుకువస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.