‘నటుడిగా నా కెరీర్ ఆసాంతం గుర్తుండిపోయే మంచి సినిమా ఇది. ఈ సినిమాలో దివంగత గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన అమ్మపాట ప్రతి ఒక్కరి హృదయాల్ని కదిలిస్తుంది’ అని అన్నారు శర్వానంద్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తిక్ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్ ప్రకాష్‌బాబు నిర్మిస్తున్నారు. రీతూవర్మ కథానాయిక. బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర టీజర్‌ను విడుదలచేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ ‘ఇది నా సినిమా అని గర్వంగా చెప్పుకొనేలా ఉంటుంది. దర్శకుడు కార్తిక్ తన మాతృమూర్తి జీవితం ఆధారంగా ఈ కథ రాసుకున్నారు. అమ్మ పాత్రలో అమల నటన మెప్పిస్తుంది. ఆమె క్యారెక్టర్ ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది’ అని తెలిపారు. ‘చనిపోయిన మా అమ్మను మళ్లీ చూడాలనే తపన నుంచి ఈ కథ పుట్టింది. శర్వానంద్ పాత్రలో నన్ను నేను చూసుకున్నా. ఆయన నటన, పాత్రచిత్రణ కొత్తగా ఉంటాయి. 90వ దశకంలోకి ప్రతీ ఒక్కరిని తీసుకెళుతుంది. చక్కటి ఎమోషన్స్‌తో పాటు మంచి కామెడీ ఉంటుంది’ అని దర్శకుడు శ్రీకార్తిక్ అన్నారు. మంచి సినిమాలో భాగమవ్వడం ఆనందంగా ఉందని అక్కినేని అమల చెప్పారు. తల్లి ప్రేమ గొప్పతనాన్ని చాటిచెప్పే చిత్రమిదని, అర్థవంతమైన సంభాషణల్ని రాసే అవకాశం దొరికిందని తరుణ్‌భాస్కర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఆర్. ప్రభు, శ్రీజీత్ తదితరులు పాల్గొన్నారు.