Sharukh Khan | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు అంటే అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేకమే. అయితే ఈసారి ఆ వేడుకలకు మరింత హైప్ తెచ్చింది ‘రాకా’ మూవీ అనౌన్స్మెంట్. బన్నీ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది.కోలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కూడా ఈ లుక్‌పై స్పందించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ‘రాకా’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.. నీలాగే అద్భుతంగా ఉంది. మీరు ఇద్దరూ కలిసి ఏ మ్యాజిక్ చేశారో చూడాలని ఆసక్తిగా ఉంది. అట్లీ స్టైల్లో చెప్పాలంటే ఇది ‘మాస్.. మాస్.. మాస్’ అనిపిస్తోంది” అంటూ ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
‘రాకా’ ఫస్ట్ లుక్‌లో అల్లు అర్జున్ లుక్ పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ముఖాన్ని తోడేలు ఆకారంలోని చేతితో కప్పుకున్నట్లుగా డిజైన్ చేయడం పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళ్లకు కాటుక, గుండు తల, నెరిసిన గడ్డం, మీసాలతో బన్నీ పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ లుక్ చూసిన వారు ఆయనను గుర్తుపట్టలేనంతగా ట్రాన్స్ఫర్మేషన్ చేశారని కామెంట్లు చేస్తున్నారు.దర్శకుడు అట్లీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. “ఇది కేవలం సినిమా కాదు.. నా 18 ఏళ్ల కల. ఈ కథ నా మనసులో చాలా కాలంగా ఉంది. ఈ ప్రయాణం నన్ను ఎంతో పరీక్షించింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే” అని ఆయన పేర్కొన్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అట్లీ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ‘రాకా’ ఫస్ట్ లుక్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేయగా, రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.