‘అంకితభావం, హార్డ్‌వర్క్‌తో పాటు నేర్చుకునే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా విజయాల్ని అందుకోవచ్చు’ అని అన్నారు సాగర్. సీరియల్స్‌తో కుటుంబ ప్రేక్షకుల మెప్పును పొందిన సాగర్ ‘షాదీ ముబారక్’ సినిమాతో హీరోగా వెండితెరపై ప్రతిభను చాటుకున్నారు. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా సాగర్ ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటిస్తూ “షాదీ ముబారక్’ తర్వాత విభిన్నమైన జోనర్లో సినిమా చేయాలని చాలా కథలు విన్నా. వాటిలో ‘100’ చిత్ర పాయింట్ నన్ను ఆకట్టుకున్నది. సామాజిక ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘మొగలిరేకులు’ సీరియల్లో చేసిన ఆర్.కె.నాయుడు మించిన పోలీస్ పాత్ర కోసం చాలా రోజులు ఎదురుచూశా. అలాంటి క్యారెక్టర్ ఇందులో దొరికింది. విక్రాంత్ పాత్ర శక్తివంతంగా సాగుతూ చాలా రోజుల పాటు గుర్తుండిపోతుంది. ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకిరానున్నది. ఈ సినిమాతో నేను నిర్మాతగా మారుతున్నా. కెరీర్ పరంగా నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌తో పాటు దర్శకుడు సుకుమార్ ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఏ క్యారెక్టర్ చేస్తున్నామనే దానికంటే ఎలాంటి కథను ఎంచుకొని సినిమా చేస్తున్నామన్నదే ముఖ్యమని తెలుసుకున్నా. క్రమశిక్షణ, అంకితభావంతో కష్టపడి పనిచేసి సీరియల్స్‌లో విజయాల్ని అందుకున్నా. అదే సూత్రాన్ని సినిమాల విషయంలో ఫాలో అవుతున్నా. ప్రతి కథ కుటుంబ ప్రేక్షకుల అభిరుచులకు దగ్గరగా ఉండేలా చూసుకుంటా’ అన్నారు.