ఆది సాయికుమార్ కథానాయకుడిగా రూపొందిన సైంటిఫిక్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘శంబాల’. అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ కీలక పాత్రధారులు. యుగంధర్ ముని దర్శకుడు. రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్‌రెడ్డి నిర్మాతలు. ఈ నెల 25న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని మేకర్స్ నిర్వహించారు. అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి, సీనియర్ నటుడు సాయికుమార్, హీరోలు మంచు మనోజ్, ప్రియదర్శి, కిరణ్ అబ్బవరం, అశ్విన్‌బాబు, సంగీత దర్శకుడు తమన్, నిర్మాతలు నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్, మైత్రీ శశి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
దర్శకుడు యుగంధర్ ముని ఈ సినిమాను అద్భుతంగా తీశాడని, నిర్మాతలు ఏ విషయంలోనూ రాజీ పడలేదని, సాంకేతికంగా అన్ని విధాలా సినిమా ఆకట్టుకుంటుందని, ఈ నెల 25న హిట్ కొట్టబోతున్నామని హీరో ఆది సాయికుమార్ నమ్మకం వెలిబుచ్చారు. టీమ్ సపోర్ట్ వల్లే ఈ సినిమాను ఇంతబాగా తీయగలిగానని దర్శకుడు యుగంధర్ ముని చెప్పారు. అందరికీ నచ్చే సినిమా ఇదని నిర్మాతలు నమ్మకంగా తెలిపారు. ఇంకా చిత్రబృందం అంతా మాట్లాడారు.