“శంబాల’ ట్రైలర్ ఇప్పుడే చూశాను. అద్భుతంగా ఉంది. ఇలాంటి సినిమాలనే ఇప్పుడంతా ఇష్టపడుతున్నారు. ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. నేపథ్యంలో వచ్చే ఇంగ్లిష్ సాంగ్ అదిరిపోయింది. ఈ సినిమాతో ఆదికి మంచి విజయం దక్కాలి.’ అని అగ్ర హీరో నాని అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా రూపొందిన సైంటిఫిక్, మైథలాజికల్ థ్రిల్లర్ ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకుడు. రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్‌రెడ్డి నిర్మాతలు. ఈ నెల 25న సినిమా విడుదల కానున్నది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. అగ్ర హీరో నాని ట్రైలర్‌ని ఆవిష్కరించి పై విధంగా స్పందించారు. ఇక ట్రైలర్ చూస్తే.. ఆకాశంలో ఉల్క పడటంతో ట్రైలర్ మొదలైంది.
‘పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైన శక్తికాదు’ అనే డైలాగ్‌తో ఆ ఉల్క శక్తిని చూపించారు. ఊళ్లో అంతా వింతగా ప్రవర్తించడం, ఉల్కను కట్టడి చేసేందుకు పూజాలు చేయడం, ఈ మిస్టరీని ఛేదించేందుకు నాస్తికుడైన హీరో రంగంలోకి దిగడం.. ‘కాశీ కాకమ్మ మజిలీకథలు ఊరి జనాలకు చెప్పండి.. నాక్కాదు’ అని హీరో అనడం.. ఇలా ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె.బంగారి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, నిర్మాణం: షైనింగ్ పిక్చర్స్.