Shalini Pandey | సోషల్ మీడియా విస్తృతి పెరుగుతున్న కొద్దీ సెలబ్రిటీలకు సంబంధించిన డీప్‌ఫేక్, ఏఐ జనరేటెడ్ కంటెంట్ కూడా ఆందోళన కలిగించే స్థాయిలో పెరుగుతోంది. ఇప్పటికే పలువురు సినీ తారలు తమ పేరుతో వైరల్ అయిన మార్ఫింగ్ వీడియోలు, ఫేక్ ఫొటోలపై స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ శాలినీ పాండే కూడా డీప్‌ఫేక్ బారిన పడినట్లు వెల్లడించింది.శాలినీ పాండే పేరుతో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారడంతో ఆమె దీనిపై స్పందించింది. తన పేరుతో చక్కర్లు కొడుతున్న ఆ వీడియో పూర్తిగా నకిలీదని, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించారని ఆమె స్పష్టం చేసింది. అందులో కనిపిస్తున్నది తాను కాదని తేల్చి చెప్పింది.
టెక్నాలజీని ఉపయోగించి మహిళలను కించపరిచేలా ఇలాంటి ఫేక్ వీడియోలను రూపొందించడం అత్యంత దారుణమని శాలినీ పాండే ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరుతో వైరల్ అవుతున్న వీడియోను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. అలాంటి వీడియోలు కనిపించినప్పుడు వాటిని ఇతరులకు పంపించకుండా, డౌన్లోడ్ చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని ఆమె కోరింది. వీలైనంత త్వరగా ఆ కంటెంట్‌ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రిపోర్ట్ చేయాలని సూచించింది. ఫేక్ కంటెంట్‌ను షేర్ చేయడం వల్ల అది మరింత మందికి చేరే అవకాశం ఉంటుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేసింది.
సెలబ్రిటీల ముఖాలను ఉపయోగించి అసలు వ్యక్తులకు సంబంధం లేని వీడియోలు, ఫొటోలను రూపొందించడం ఇటీవలి కాలంలో పెద్ద సమస్యగా మారింది. గతంలో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, శ్రుతిహాసన్, టబు, ఐశ్వర్య రాయ్ బచ్చన్ తదితర హీరోయిన్ల పేర్లతోనూ డీప్‌ఫేక్ కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.తాజాగా శాలినీ పాండే ఘటన కూడా అదే కోవలోకి చేరింది. దీంతో సెలబ్రిటీల డిజిటల్ భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. ఏఐ టెక్నాలజీని సృజనాత్మకంగా ఉపయోగించడంతో పాటు దుర్వినియోగం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, షాలినీ పాండే 2017లో విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటన, సహజమైన ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ‘మహానటి’, ‘118’, ‘జయేష్‌భాయ్ జోర్దార్’, ‘మహారాజ్’ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.