సాధారణంగా అగ్ర నటుడి వారసుడు అంటే హీరోగానే అరంగేట్రం చేయాలని అభిమానులు కోరుకుంటారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ రచయితగా పరిశ్రమలో అరంగేట్రం చేయబోతుండటం విశేషం.
తనకు హీరోగా నటించాలని లేదని, తెర వెనక ప్రతిభాసామార్థ్యాల్ని చాటుకొని ఆ తర్వాత నటన గురించి ఆలోచిస్తానని చాలా సందర్భాల్లో చెప్పాడు ఆర్యన్‌ఖాన్. ప్రస్తుతం ఆయన ఓ కామెడీ వెబ్‌సిరీస్ కోసం కథను సిద్ధం చేస్తున్నాడని తెలిసింది. బాలీవుడ్ సినీరంగం నేపథ్యంలో ఈ కథ ఉంటుందని, రోజువారి జీవితంలో తారలు ఎదుర్కొనే సంఘటనలు, తెరవెనక వారి అనుభవాల్ని హాస్యం, వ్యంగ్యం ప్రధానంగా ఈ సిరీస్‌లో చూపించబోతున్నారని సమాచారం.
సినిమా వాతావరణంలోనే పెరగడం వల్ల ఆర్యన్‌ఖాన్‌కు ఇండస్ట్రీ సంగతులపై మంచి పట్టుందని, స్వతహాగా హాస్యచతురత కలిగిన ఆయన ఈ సిరీస్ ద్వారా రచయితగా సత్తా చాటుతాడని షారుఖ్‌ఖాన్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ సిరీస్‌కు ఆర్యన్‌ఖాన్ కథతో పాటు మాటలు కూడా అందిస్తున్నారని తెలిసింది.