షారుఖ్ ఖాన్ నటిస్తున్న కొత్త సినిమా ‘పఠాన్’. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్నది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. ఈ సినిమాలో దీపికా పడుకోన్, జాన్ అబ్రహాం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ‘8 కంట్రీస్, 3 సూపర్ స్టార్స్, వన్ ఫిలిం..’ అంటూ సోషల్ మీడియా ద్వారా ఈ చిత్ర యాక్షన్ స్టిల్స్ షేర్ చేసింది మూవీ టీమ్. ఈ సినిమా యాక్షన్ సీక్వెన్సులు 8 దేశాల్లో చిత్రీకరిస్తున్నారు. స్పెయిన్, యూఏఈ, టర్కీ, రష్యా, సెర్బియా, ఇటలీ, ఫ్రాన్స్, అఫ్గాన్ దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరపడం విశేషం.
షారుఖ్ కెరీర్లో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా నిలుస్తుందనే అంచనాలున్నాయి. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 2018లో ‘జీరో’ సినిమా తర్వాత ఈ స్టార్ హీరో తెరపై కనిపించనున్న చిత్రమిదే. షారుఖ్ ఖాతాలో ఈ సినిమాతో పాటు అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న ‘జవాన్’, రాజ్ కుమార్ హిరాణీ రూపొందిస్తున్న ‘డంకీ’ చిత్రాలున్నాయి.