Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండియాలో ఉన్న దిగ్గజ నటులలో షారుక్ కూడా ఒకరు. అయితే కెరీర్ ప్రారంభంలో టీవీ సీరియల్స్‌లో నటించిన ఈ కింగ్ ఖాన్, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి బాలీవుడ్ అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. అయితే, కెరీర్ తొలినాళ్లలో తాను అనుభవించిన తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు షారుక్. తన వద్ద డబ్బులు లేక ఇంటి అద్దె కట్టలేని పరిస్థితిని ఎదుర్కోన్నట్లు తెలిపాడు.
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో రోడ్డుపై పడుకోవాల్సి వచ్చిందని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ వెల్లడించారు. అద్దె చెల్లించేందుకు డబ్బులు లేక ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నానని ఆయన తెలిపారు. అలాగే సొంత ఇల్లు కలిగి ఉండడం గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నా పిల్లలకు ఇల్లు లేకుండా ఉండకూడదు అనే భయం నాకు ఎప్పుడూ ఉంది. అందుకే మంచి ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు, చదువు ఉంటే ప్రపంచం మీ చేతిలో ఉన్నట్లే. ఉద్యోగం, డబ్బు లేకపోయినా పర్వాలేదు, కనీసం నిద్రించడానికి, కూర్చొని ఏడవడానికి ఒక ఇల్లు ఉండాలి. కెరీర్ తొలినాళ్లలో నేను రోడ్లపై పడుకున్నాను. అద్దె చెల్లించలేక ఇంటి నుంచి బయటకు గెంటేసిన సందర్భాలు ఉన్నాయి అని షారుక్ తెలిపాడు.
అలాగే, తనతో నటించే యంగ్ హీరోయిన్లకు ఎందులో అయిన పెట్టుబడి పెట్టే ముందు సొంత ఇల్లు కొనుగోలు చేయాలని సలహా ఇస్తానని షారుక్ వివరించారు. యంగ్ హీరోయిన్లకు సొంత ఇల్లు కొనమని చెబుతాను. వాళ్లు నిజంగా ఇల్లు కొన్నామని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా ఇల్లు ‘మన్నత్’(షారుక్ ఇంటి పేరు)ను అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఈ ఇల్లు నా ఇతర విజయాలను కొంత తక్కువ చేసి చూపిస్తుంది, కానీ పర్వాలేదు. నేను డబ్బు తినను. వెండి ప్లేట్లో భోజనం చేసినా రుచి పెరగదు. అందరిలాగే సాధారణ ఆహారమే తింటాను, సామాన్య బట్టలే ధరిస్తాను. నా వద్ద నాలుగు జతల జీన్స్ మాత్రమే ఉన్నాయి. ప్రజలు నా గురించి ఎంత భిన్నంగా ఆలోచించినా, 20 ఏళ్ల క్రితం నేను ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలాగే ఉన్నాను అని షారుక్ తెలిపారు.
దివానా సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన షారుక్.. ఆ తర్వాత బాజీగర్, డర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం యష్ చోప్రా నిర్మాణంలో వచ్చిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే(DDLJ) సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు షారుక్. అనంతరం దిల్‌తో పాగల్ హే, దేవ్‌దాస్, వీర్‌జారా సినిమాలతో బాలీవుడ్ కింగ్ ఖాన్‌గా ఎదిగాడు.