Shah Rukh Khan | కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్‌లతో విసిగి వేసారిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఇప్పుడు మళ్లీ టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడంతో కింగ్ ఖాన్ అభిమానులూ పండుగ చేసుకుంటున్నారు. ఇదే జోరులో ప్రొడ్యూసింగ్ సంస్థ వాచ్మోజో షారుఖ్ ఖాన్ నటించిన చిత్రాల్లో టాప్ పది సినిమాల జాబితా విడుదల చేసింది. అందులో ‘దిల్‌తో పాగల్ హై’ పదో ర్యాంకు దక్కించుకుంది. ‘డర్’ తొమ్మిది, ‘దేవ్‌దాస్’ ఎనిమిది, ‘పఠాన్’ ఏడు, ‘జవాన్’ ఆరో ర్యాంకింగ్ పొందాయి. ‘కభీ ఖుషీ కభీ గమ్’ ఐదో ర్యాంకు, ‘బాజీగర్’ నాలుగు, ‘కల్ హో న హో’ మూడు, ‘కుచ్ కుచ్ హోతా హై’ రెండో ర్యాంకులో నిలిచాయి.
‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ మొదటి స్థానం దక్కించుకుంది. ఈ ర్యాంకింగ్‌పై కింగ్ ఖాన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బాద్ షా నటించిన ఎవర్గ్రీన్ హిట్ చిత్రాలు ‘వీర్‌జారా’, ‘మై హూ నా’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’, ‘చక్ దే ఇండియా’, ‘స్వదేశ్’ చిత్రాలకు ఈ జాబితాలో చోటు దక్కకపోవడంపై కొందరు పెదవి విరుస్తున్నారు. మరికొందరైతే షారుఖ్ చిత్రాలకు ర్యాంకింగ్స్ వర్తించవంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.