Shah Rukh Khan Remuneration | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిన కూడా ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం షారుఖ్ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక షారుఖ్ సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళయింది. ‘జీరో’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. అయితే జీరో చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం షారుఖ్‌ఖాన్ ఆశలన్ని ‘పఠాన్’ చిత్రంపైనే ఉన్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి.
కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం షారుఖ్ ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. షారుఖ్ సినిమా వచ్చి నాలుగేళ్ళయినా.. ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నాడంటే ఆయన క్రేజ్ ఏంటో తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటించిన దీపికా పదుకోనే రూ.15 కోట్లు, జాన్ అబ్రహం రూ.20 కోట్ల భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నారట. చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ చిత్రం యష్‌రాజ్ ఫిలింస్ సంస్థలో 50వ సినిమా కావడం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా టీజర్ షారుఖ్ బర్త్‌డే సందర్భంగా నవంబర్ 2న రిలీజ్ కానుంది.