Pathaan 2 | బాలీవుడ్లో హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు షారుఖ్‌ఖాన్, దీపికాపడుకోన్. వీరిద్దరి కలయిలో వచ్చిన ‘పఠాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు నిర్మాత ఆదిత్య చోప్రా. యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కనున్న ఈ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ సిద్ధమవుతున్నదని, ఇందులో కూడా దీపికా పడుకోన్ కథానాయికగా నటిస్తుందని ఆదిత్యచోప్రా తెలిపారు.
‘వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్‌మీదకు తీసుకొస్తాం. ఇంకా దర్శకుడెవరో నిర్ణయించలేదు. ‘పఠాన్’ కథకు కొనసాగింపుగా రానున్న ఈ సీక్వెల్లో చాలా సర్‌ప్రైజ్‌లుంటాయి’ అని ఆదిత్య చోప్రా వెల్లడించారు. ‘పఠాన్’ సినిమా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం వల్ల సీక్వెల్ కోసం మరో దర్శకుడ్ని అన్వేషిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం షారుఖ్‌ఖాన్ ‘కింగ్’ చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.