‘స్కూల్‌రోజుల్లో నాకు చదువు అంతగా వంటబట్టలేదు. చాలాసార్లు ఫెయిల్ అయ్యా. ఆ తర్వాత షార్ట్‌ఫిల్మ్స్ తీయడంతో పాటు కొన్ని సినిమాల ఆడిషన్‌కు హాజరయ్యాను. ఎక్కడా సెలెక్ట్ కాలేదు. దాంతో నాలో కసి పెరిగింది. నేనేమిటో నిరూపించుకోవాలనుకున్నా. అలా హీరోగా ‘సెహరి’ సినిమా చేశాను’ అన్నారు హర్ష్ కనుమిల్లి. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. వర్గో పిక్చర్స్ పతాకంపై జిష్ణు రెడ్డి నిర్మించారు. ఈ నెల 11న విడుదలకానుంది. సోమవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. హర్ష్ మాట్లాడుతూ ‘లాక్డౌన్ సమయంలో ఈ సినిమా పోస్టర్‌ను బాలకృష్ణగారు లాంచ్ చేశారు. దాంతో ఈ సినిమా స్థాయి పెరిగింది. పాటలకు మంచి ఆదరణ లభిస్తున్నది’ అన్నారు. ‘నేటితరం కథ ఇది. తొమ్మిది పాటలు సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అని దర్శకుడు చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఓటీటీలో మంచి ఆఫర్లొచ్చాయి. కానీ థియేటర్లో చూస్తే ఈ సినిమా ఓ ఉత్సవంలా అనిపిస్తుంది. అందుకే థియేటర్ రిలీజ్‌కే మొగ్గుచూపాం’ అని తెలిపారు. ఈ సినిమాలో నటుడిగా తనను సరికొత్త కోణంలో ఆవిష్కరించారని సంగీత దర్శకుడు కోటి అన్నారు. తొమ్మిది పాటలు వేటికవే గొప్పగా అనిపిస్తాయని చిత్ర సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారీ పేర్కొన్నారు.