Samantha | ‘నిర్మాతలు వరుసగా ఎందుకు సినిమాలు చేస్తారో ఇప్పుడర్థమైంది. ప్రేక్షకుల్ని నవ్వించాలన్నదే వారి లక్ష్యం. ఈ సినిమా షూటింగ్ టైంలో నాకు స్కూల్ రోజుల్లోని వేసవి సెలవులు గుర్తుకొచ్చాయి. మాకు ఎలాగైనా సినిమా చూపించాలని అమ్మ తపన పడేది. థియేటర్లో సినిమా చూస్తూ అన్నయ్యతో గొడవపడటం, సినిమా గురించి అదే పనిగా చర్చించుకోవడం…ఇలాంటి జ్ఞాపకాలను ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతోనే నిర్మాణ సంస్థను స్థాపించాను’ అని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. ఆమె నిర్మాతగా మారి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ‘శుభం’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ హారర్ కామెడీ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. శుక్రవారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ పై విధంగా స్పందించింది. నిర్మాతగా మారిన తర్వాత సినిమాను చూసే దృష్టికోణం మారిందని, నటిగా ఉన్నప్పుడు సినిమా రివ్యూల్లో తనకు సంబంధించిన విషయాలను ముందుగా చదివేదాన్నని, ఇప్పుడు అందరి గురించి ఆలోచిస్తున్నానని సమంత తెలిపింది. ఈ సినిమా నిర్మాణం విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో సపోర్ట్ చేసిందని, టీమ్ అందరి కృషి వల్లే ఇంతటి విజయం సాధ్యమైందని సమంత ఆనందం వ్యక్తం చేసింది.